Jun 12,2023 18:11

వివరాలు వెల్లడిస్తున్న డిఇఒ డాక్టర్‌ రంగారెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
జిల్లాలో నాడు-నేడు రెండో విడత కింద ఎంపికైన పాఠశాలలో అదనపు గదులు, ప్రహరీ పనులు మినహా అన్ని పనులూ వారం రోజుల్లో పూర్తి చేస్తామని డిఇఒ డాక్టర్‌ రంగారెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్‌ హైస్కూల్‌లో ఆయన సమగ్ర శిక్ష పిఒ డాక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1081 పాఠశాలలు, 82 అంగన్వాడీ కేంద్రాలు, 23 జూనియర్‌ కళాశాలలు నాడు-నేడు రెండో విడత కింద ఎంపికయ్యాయని తెలిపారు. రూ.526 కోట్ల పనులు చేపడుతున్నామని చెప్పారు. ఆదోని డెవలప్‌మెంట్‌ అథారిటీ కింద 5 ఉన్నత పాఠశాలలో, 33 ప్రైమరీ పాఠశాలలో సౌకర్యాల కల్పనకు రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 259 స్కూళ్లలోని తరగతి గదుల్లో 2032 డిజిటల్‌ బోర్డులను అమర్చామని తెలిపారు. 427 స్కూళ్లలో 1,039 స్మార్ట్‌ టీవీలను పంపిణీ చేశామన్నారు. 2,92,955 మంది విద్యార్థులకు రూ.2500 విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్లను అందిస్తున్నామన్నారు వాటి విలువ రూ.73.23 కోట్లు అని తెలిపారు. బెల్టు, నోట్‌ బుక్‌ మినహా పూర్తిస్థాయిలో జెవికె కిట్లు పాఠశాలలకు అందాయన్నారు.