
- అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): వారంలో కనీసం మూడు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఓ పి వెంకటరమణ, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్ర పర్యటన, రికార్డుల నిర్వహణ, జగనన్న ఆరోగ్య సురక్ష, సాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పర్యటించినప్పుడు చాలా సమస్యలు వారి దష్టికి వస్తున్నాయని, అవి పరిష్కారం కావడం లేదని ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో ప్రస్తావించడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఇకపై జిల్లా అధికారులందరూ కనీసం మూడు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వారి పర్యటన వివరాలు సంబంధిత శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులకు ముందుగా తెలపాలన్నారు. ఏ అధికారి ఏ గ్రామంలో పర్యటించారు అక్కడి సమస్యలు వివరాలను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయాలన్నారు. కొన్ని మండలాల తహసిల్దార్లు వారి కార్యాలయంలో సరిగా రికార్డులు కానీ రికార్డు విభాగాలు గానీ నిర్వహించడం లేదని తెలుస్తోందన్నారు. ఒక వారం రోజుల లోపల వారు రికార్డులన్నీ సరైన పద్ధతిలో నిర్వహించాలని, ప్రతి ఒక్కటి జాబితా తయారుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో సాగునీటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.