ప్రజాశక్తి - కౌతాళం
కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న శ్రావణమాస ఉత్సవాలు వారం రోజుల్లో అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. నెల రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లలో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఈ ఉత్సవాలకు సుమారు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు పుణ్యక్షేత్రానికి వస్తారు. శ్రావణమాస ఉత్సవాల నుంచి దేవాలయానికి రూ.12 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక ఆదాయం వస్తున్న దేవాలయంగా శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం నిలిచింది. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా దేవాలయానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు కల్పించేందుకు టెండర్ల ప్రక్రియ ఎప్పుడో పూర్తి కావాల్సింది. టెండర్లు పూర్తయితేనే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి పనులు ప్రారంభమవుతాయి. నేటికీ ముఖ్యమైన టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.
పుణ్యక్షేత్రంలో ఈరన్న స్వామి అలంకరణ కోసం పూలమాలలు, వస్త్రాలు, నిత్యాన్నదానం కోసం వంట చెరకు, ప్లంబింగ్, కొబ్బరికాయల విక్రయాలు, తలనీలాలు పోగు చేసుకునే హక్కు, నిత్యాన్నదానం సత్రం వద్ద, దర్శనం కోసం టికెట్ల కౌంటర్ వద్ద, స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లతోపాటు తాత్కాలిక షెడ్లు, పుణ్యక్షేత్రం డెకరేషన్ కోసం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహిస్తారు. ఇందులో కొన్ని పూర్తి కాగా, పెండల్, డెకరేషన్, గరుసు వేసేందుకు ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి.
శ్రావణమాస ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు క్యూలైన్లు, టికెట్ల కౌంటర్ల వద్ద క్యూలైన్లు, అన్నదాన సత్రం వద్ద క్యూలైన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో షెడ్లు, కౌతాళం, కోసిగి, ఆదోని వద్ద ఆర్చి గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దేవాలయానికి విద్యుత్ అలంకరణతో పాటు పుణ్యక్షేత్రంలో విద్యుద్దీపాలు వెలిగించాల్సి ఉంది. క్షేత్రం ఆవరణలో అక్కడక్కడ ఏర్పడిన గుంతల వద్ద, వర్షపు నీరు నిల్వ ఉన్న చోట గరుసు వేయాల్సి ఉంది. ఈ టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. క్యూలైన్లు, షెడ్లు, ఆర్చి గేట్లు వేయడానికి కనీసం 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. డెకరేషన్ చేయడానికి కూడా సమయం ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఈ పనులు కాకుండా పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, స్నానపు ఘాట్ వద్ద భక్తులకు ఏర్పాట్లు, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు అనేక పనులు చేయాల్సి ఉంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం వస్తారు. నెలరోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఇటీవల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప ఏర్పాట్లపై పెద్దగా శ్రద్ధ వహించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి భక్తుల నుంచి మంచి పేరు సంపాదిస్తారో, లేక విమర్శలకు గురవుతారో వేచి చూడాల్సిందే.
శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం










