
ప్రజాశక్తి-యస్.రాయవరం:మండలంలోని అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధానమైన రహదారిని వారం రోజుల్లో మరమ్మత్తులు చేపడతామని ఆర్‌అండ్‌బి అధికారులు హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు ఆందోళన విరమించారు. శుక్రవారం ఉదయం నర్సీపట్నం వెళ్ళే రహదారిని అడ్డురోడ్డు వద్ద సిపిఎం నాయకులు నిర్భంధించారు. అడ్డురోడ్డు నుండి నర్సీపట్నం వెళ్ళే రోడ్డు రామచంద్రాపురం వరకు పెద్ద పెద్ద గోతులు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు తెలిపారు.ఈ ఆందోళనకు స్పందించిన అధికారులు సిపిఎం నాయకులతో మాట్లాడి వారం రోజుల్లో రోడ్డు మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, ఇప్పటికే అనేక పర్యాయాలు అధికారులు హామీలు ఇవ్వడం జరిగిందని, అయినా చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోతే ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.అప్పన్న, కోటవురట్ల ఎస్‌ఐ నారాయణరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి అధికారి సింహాద్రి రాజు, సిపిఎం మండల కన్వీనర్ ఎం.సత్యనారాయణ, జీ.డేవిడ్ రాజు, బి.రాము, ఎం.సూరిబాబు, రాజుబాబు, రమేష్ పాల్గొన్నారు.