Nov 06,2023 21:22

మాట్లాడుతున్న జెసి అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం : గ్రామాల్లో నీటి వనరుల లెక్కింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఇంజినీరింగ్‌ అధికారులు, ఎంఇఒలతో సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌, పంచాయితీరాజ్‌ భవనాలు, జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణం, నీటి వనరుల లెక్కింపు, సచివాలయాల వద్ద బోర్డులు ఏర్పాటు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సుమారు రెండున్నర లక్షలు పైగా వైద్య సేవలు పొందారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఎంపిక చేసిన రిఫరల్‌ కేసులను పర్యవేక్షించి, డిసెంబరు లోగా వారికి వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. ప్రతీ ఒక్క కేసును సీరియస్‌గా తీసుకొని అవసరమైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరిచేతా ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి, రిజిష్టర్‌ అయ్యేలా చూడాలని సూచించారు. వాలంటీర్లు, ఎఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది దీనికి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సచివాలయం వద్ద ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 160 సచివాలయాలకు బోర్డులను పంపించామని, మిగతావి కూడా త్వరలో వస్తాయని చెప్పారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చెరువులు, చెక్‌డ్యాములు తదితర నీటి వనరుల లెక్కింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల వారీగా నీటి వనరులు, వాటి విస్తీర్ణం, లోతు, లభ్యమయ్యే నీరు, ఆయుకట్టు, తదితర అంశాలను, ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో నమోదు చేయాలని జెసి సూచించారు. విసిలో జిల్లా కేంద్రం నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.