Oct 24,2023 21:34

నిరుపయోగంగా ఉన్న మున్సిపల్‌ వాణిజ్య సముదాయం

       హిందూపురం : హిందూపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాణిజ్య భవన సముదాయం నిర్మితం అయ్యింది. ఇక్కడ వేలం పాట నిర్వహణ సమయంలో మున్సిపల్‌ అధికారులు విడుదల చేసిన గెజిట్‌లో చెప్పిన విధంగా సౌకర్యాలు కల్పించక పోవడంతో ఏడాదిగా వాణిజ్య సముదాయం నిరుపయోగంగా ఉంది. దీంతో పురపాలక సంఘానికి నెలకు లక్షల్లో వచ్చే ఆదాయానికి గండి కొడుతోంది. అదే మార్కెట్‌ వ్యాపారులు, పాలకులు, అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిస్తుండడం విశేషం. ఇక్కడే ఆకుకూరల వ్యాపారం చేసుకునే వారికి నాలుగు అడుగుల స్థలాన్ని కేటాయించాలంటే గుడ్‌విల్‌ తీసుకుని వారికి నెలకు అద్దె నిర్ణయించి లాటరీ విధానం ద్వారా స్థలాన్ని కేటాయించారు. మార్కెట్‌, వాణిజ్య సముదాయ భవనాల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎటువంటి అనుమతులు, గుడ్‌ విల్‌, కనీస అద్దె సైతం లేకుండా రోజుకు లక్షల్లో వ్యాపారం చేసుకునే పూల వ్యాపారులకు కేటాయించారు. దీంతోపాటు కూరగాయల హోల్‌సేల్‌ వ్యాపారులకు పరిగి బస్టాండ్‌లో సిండికేట్‌ ఫార్మా సోసైటీకి కేటాయించిన స్థలాన్ని కేటాయిస్తామని కౌన్సిల్‌ అనుమతి తీసుకున్నారు. అందులో సగం బస్టాండ్‌కు కేటాయించారు. ఈ నిర్ణయంతో బస్సులు నిలపడానికి స్థలం చాలక పోవడంతో పాటు బస్టాండ్‌ను నమ్ముకుని జీవనం చేస్తున్న ఎంతో మంది చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు.
పట్టణంలో శిథిలావస్థకు చేరిన మార్కెట్‌ను కూల్చి వేశారు. నిధులు లేకపోయినా గత ప్రభుత్వ హయాంలో రూ. 23 కోట్లతో నూతన మార్కెట్‌, వాణిజ్య సముదాయం నిర్మించారు. పనులు చివరి దశలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మున్సిపాల్టీకి సంపదను చేకూర్చే మార్కెట్‌ను ప్రస్తుత పాలకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అధికార పార్టీ నాయకులు కొందరు మార్కెట్‌ను అడ్డుపెట్టుకుని భారీగా వెనుక వేసుకున్నారు. అది చాలదన్నట్లు టోకు కూరగాయల వ్యాపారులకు మార్కెట్లో స్థలాలు లేవని, వారికి స్థలాల కేటాయింపును సైతం నాయకులు తమకు ఆదాయ వనరుగా చేసుకున్నారు. టోకు వ్యాపారులకు మార్కెట్‌ సమీపంలోని ప్రయివేటు బస్టాండ్‌లో స్థలాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేశారు. ఇక్కడ గతంలో సిండికేట్‌ పార్మర్స్‌ సొసైటీకి కేటాయించిన స్థలం దుర్వినియోగం కావడంతో మున్సిపాల్టీ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాన్ని వ్యాపారులకు ఇవ్వాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. స్వాధీనం చేసుకున్న స్థలంతో పాటు బస్టాండ్‌లో మరింత స్థలాన్ని వ్యాపారులకు కట్టబెట్టారు. ఇందులో అధికార పార్టీలోని కొందరు వ్యాపారుల పేరిట స్థలాలు చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థలాలను కేటాయించినందుకు నాయకులు, కౌన్సిలర్లు, అధికారులకు వ్యాపారులు పెద్దమొత్తం ముట్టచెప్పినట్లు సమాచారం. బస్టాండ్‌లోని స్థలం అంతా వ్యాపారులు, మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణానికి ఉపయోగించడంతో ప్రయివేటు బస్టాండు ప్రస్తుతం చిన్నదిగా మారింది. దీంతో బస్సులు, వాహనాలు నిలపడానికి ఇబ్బందికరంగా మారింది. బస్టాండ్‌లో గతంలో మరుగుదొడ్లు నిర్మించిన స్థలాన్ని సైతం టోకు వ్యాపారులకు కేటాయించారు. మరుగుదొడ్లు నిర్మాణానికి 25 ఏళ్ల లీజు పొందిన గుత్తేదారుడు లబోదిబోమంటున్నారు. తన పరిస్థితిని అధికారులు, అధికార పార్టీ నాయకులకు వివరించినా ఆయనకు న్యాయం జరగలేదు. ఈ అన్యాయంపై ఆయన కోర్టుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఏది ఎమైనప్పటికీ పురపాలక సంఘానికి ఆదాయాన్ని చేకూర్చే వాణిజ్య సముదాయం నుంచి పురపాలక సంఘానికి ఆదాయం రాక పోయినప్పటికి పాలకులకు, అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.