Aug 28,2023 20:42

ycp flag

వారికి గ్రీన్‌ సిగల్‌..?
- వైసిపిలో ఆరుగురికి టికెట్‌ ఖరారయినట్లు ప్రచారం
- సామాజిక మాధ్యమాల్లో జాబితా చక్కర్లు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

     వారికి వైసిపి తరపున టికెట్‌ ఖరారు అయిందా..? అవుననే అంటోంది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ జాబితా. ఆ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా నుండి ఆరుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పోటీకి గ్రీన్‌ సిగల్‌ పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది...
ఏపిలో 175 శాసనసభ స్థానాలలో నిర్వహించిన సర్వేలో సిట్టింగ్‌, ఎమ్మెల్యేలలో ప్రజల మన్నననలు పొంది మరోసారి గెలిచే అవకాశాలు ఉన్న 75 మందితో తొలి జాబితా సిద్ధం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ 75 స్థానాల్లో రాష్ట్ర మంత్రులతో పాటు తొలి కేబినెట్‌లో మంత్రులుగా పని చేసిన వారు ఉన్నారు. అలాగే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కొత్త ముఖాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న తాజా తొలి జాబితా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 శాసనసభా నియోజక వర్గాలు ఉండగా వాటిలో 6 నియోజక వర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఆ 75 మంది పేర్ల జాబితాలో ఉన్నాయి. అందులో భాగంగా డోన్‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పత్తికొండ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పేర్లు వెల్లడవుతున్నాయి. ఎమ్మిగన్నూరు నుంచి చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి సాయి ప్రసాద్‌ రెడ్డి పేర్లు ఖరారైనట్లు వైరల్‌ అవుతున్న జాబితా మూలంగా చర్చ సాగుతోంది. మొత్తంగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న 75 మంది జాబితాపై అధికార పార్టీ నేతలంతా కూడా చర్చలు చేసుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార పార్టీ ఆరుస్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ జాబితాలో పేర్లు వెల్లడించగా వాటి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. సీనియర్లకు ఎలాగూ టిక్కెట్లు రావడం ఖాయమని వారి అభిమానులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాకపోతే పత్తికొండ, ఎమ్మిగన్నూరు నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్‌ వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. వీటితో పాటు మిగిలిన నియోజక వర్గాల్లో గ్రూపుల గోల అధికంగా ఉంది. ముఖ్యంగా దళిత నియోజకవర్గాలైన కోడుమూరులో ఇదే పరిస్థితి ఉండగా, నందికొట్కూరులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక కర్నూలులో కూడా అటువంటి పరిస్థితే ఉంది. దీంతో ఆయా చోట్ల సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కుతాయో లేదోనన్న దానిపై అధికార వైసిపి వర్గాల్లోనే ఉత్కంఠ నెలకొంది. అయితే కర్నూలు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. అయితే కొందరు నాయకులతో ఆయనకి పొసగకపోవడం, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డికి, ఆయనకు గ్రూపు గోల ఉండటంతో అక్కడ తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనని అక్కడి నాయకులు ఎదురు చూస్తున్నారు.