Feb 20,2023 22:04

వైసిపి ఎంఎల్‌సి అభ్యర్థుల జాబితా విడుదల
స్థానిక ఎంఎల్‌సి స్థానాలకు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్ర అభ్యర్థిత్వాలు ఖరారు
ఎంఎల్‌ఎ కోటాలో జయమంగళ వెంకటరమణకు ఛాన్స్‌
తీవ్ర అసంతృప్తిలో ఆశావహులు
జెడ్‌పి ఛైర్మన్‌ పదవి కోసం మొదలైన వ్యూహాలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

             జిల్లాలోని స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల అభ్యర్థుల జాబితాను అధికార వైసిపి సోమవారం విడుదల చేసింది. స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి జిల్లాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్‌సి స్థానాల్లో ఒకటి ప్రస్తుత జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌కు, రెండో స్థానానికి మధ్యతరహా పరిశ్రమల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంకా రవీంద్రను ఎంపిక చేశారు. ఎంఎల్‌ఎ కోటాలో ఇటీవలే టిడిపి నుంచి వైసిపిలో చేరిన కైకలూరు మాజీ ఎంఎల్‌ఎ జయమంగళ వెంకటరమణకు అవకాశం కల్పించారు. ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి కష్టపడి పని చేస్తున్న వారికి అవకాశం ఇవ్వకుండా ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న నాయకులకే మళ్లీ ఎంఎల్‌సి పదవులు కట్టబెట్టడం ఏమిటని పార్టీలో నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి రెండు పదవుల్లో ఒకటి బిసి, రెండోది జనరల్‌కు కేటాయించనున్నట్లు ముందుగానే స్పష్టత వచ్చింది. టిడిపి నుంచి వైసిపిలోకి వచ్చిన జయమంగళ వెంకటరమణ బిసి కావడంతో మరో పదవి జనరల్‌ కేటగిరీలో ఇస్తారని అంతా భావించారు. అయితే వైసిపి అధిష్టానం అందరికీ షాక్‌ ఇచ్చేవిధంగా అభ్యర్థులను ఎంపిక చేసింది.
పదవుల్లో ఉన్న వారికే మళ్లీ పదవులు
ప్రస్తుతం జెడ్‌పి ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్‌ ఉన్నారు. ఈయనకు ఇంకా దాదాపు మూడున్నరేళ్లు పదవీకాలం ఉంది. పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబుకుగాని, మేకా శేషుబాబుకుగాని ఎంఎల్‌సి పదవి వరిస్తుందని అంతా భావించారు. అయితే వైసిపి అధిష్టానం మాత్రం కవురు శ్రీనివాస్‌ పేరును ప్రకటించింది. గుణ్ణం నాగబాబుకు ఎంఎల్‌సి పదవిపై నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో వైసిపి అధిష్టానం వ్యూహాం మార్చినట్లు తెలుస్తోంది. గుణ్ణంకు పదవి ఇస్తే మేకా శేషుబాబు ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అదే జరిగితే ఎంఎల్‌సి ఎన్నికలు అనివార్యం కావడంతోపాటు శెట్టిబలిజ, గౌడ సామాజిక తరగతి శేషుబాబుకు వెన్నుదన్నుగా నిలబడే అవకాశం ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. అదే సామాజిక తరగతికి చెందిన కవురు శ్రీనివాస్‌కు ఇస్తే శేషుబాబు పోటీ చేసే అవకాశం ఉండకపోగా శెట్టిబలిజ, గౌడ సామాజిక తరగతిలో పార్టీకి పేరు వస్తుందని లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి నిమ్మల రామానాయుడు ఎంఎల్‌ఎగా పోటీచేసే అవకాశం ఉంది. రామానాయుడు కాపు సామాజిక తరగతి కావడంతో అదే తరగతికి చెందిన గుణ్ణం నాగబాబుకు ఎంఎల్‌ఎ టిక్కెట్‌ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కవురు శ్రీనివాస్‌కు ఎంఎల్‌సి సీటు ఇవ్వడంతో నాగబాబుకు టిక్కెట్‌ విషయంలో పోటీ కూడా ఉండదు. ఈ ఎత్తుగడతోనే కవురుకు ఎంఎల్‌సి ఇచ్చినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వంకా రవీంద్ర ఇప్పటికే మధ్యతరహా పరిశ్రమల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడంతో ఎంఎల్‌సి పదవి కోసం ఈయన గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో మరో పదవి వంకా రవీంద్రకు ఇచ్చినట్లు చెబుతున్నారు. రెండు ఎంఎల్‌సి పదవులు నరసాపురం పార్లమెంట్‌ స్థానంలో ఇవ్వడం సైతం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మెట్ట ప్రాంతానికి పదవి ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. టిడిపి నుంచి ఎంఎల్‌సి పదవి హామీతో వైసిపికిలోకి వచ్చిన జయమంగళ వెంకటరమణకు ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి అవకాశం కల్పించారు. జయమంగళ కూడా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగారు. ఎంఎల్‌సి పదవి ఆశించిన వారిలో నల్లజర్లకు చెందిన కారుమంచి రమేష్‌తోపాటు పలువురికి తీవ్ర నిరాశే మిగిలింది.
జెడ్‌పి ఛైర్మన్‌ పదవి కోసం వ్యూహాలు
ప్రస్తుత జెడ్‌పి ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌కు ఎంఎల్‌సి టిక్కెట్‌ ఖరారు చేయడంతో తదుపరి జెడ్‌పి ఛైర్మన్‌ పదవి ఎవరికిస్తారనే చర్చ నడుస్తోంది. బిసి సామాజిక తరగతికి చెందిన పలువురు జెడ్‌పిటిసిలు ఛైర్మన్‌ పదవి కోసం ఇప్పటికే అధిష్టానం వద్దకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 23వ తేదీతో ఎంఎల్‌సి నామినేషన్ల తుదిగడువు ముగియనుంది. ఎంఎల్‌సి ఎన్నిక అధికారికంగా ఖరారవ్వగానే కవురు శ్రీనివాస్‌ జెడ్‌పి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో జెడ్‌పి చైర్మన్‌ పదవి కోసం నాయకుల వ్యూహాలు సాగుతున్నాయి.