Jun 20,2021 07:18

   త్పాతాలు, ఉపద్రవాలూ ముంచెత్తిన తరుణంలో సమాజం మరింత మానవీయంగా స్పందించటం చాలా అవసరం. ప్రజల్లో అలాంటి ఉమ్మడితనాన్ని, మానసిక ఔన్నత్యాన్ని పెంచి సరైన పద్ధతిలో అవసరార్థులకు అందేలా చేయడం పాలకుల బాధ్యత. కేవలం ఆర్భాటాలూ, అధిక ప్రసంగాలతోనే సరిపుచ్చి, చేతల విషయంలో చచ్చుపుచ్చు రీతిగా వ్యవహరిస్తే- ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రమాదాన్ని నిలువరించే కర్తవ్యంలో ముందుపీఠిన నిలిచిన యోధులకు నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కోవిడ్‌ మహమ్మారి దేశం మీద విచ్చలవిడిగా చెలరేగుతున్నప్పుడు పాలకులు అనుసరిస్తున్న తీరు ఇప్పుడిలాగే అఘోరిస్తోంది. ప్రజారోగ్యం, స్వచ్ఛ భారతం వంటి అంశాల్లో మోడీ ప్రభుత్వం ఎంత హంగామా చేసినా...క్షేత్రస్థాయిలో ఆ పనులను నిర్వహించాల్సిందీ, నిర్దేశిత లక్ష్యాలను సాధించాల్సిందీ ఆయా రంగాల్లోని నిపుణులూ, శ్రామికులూ. ఆపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి, వివిధ శ్రేణుల్లోని కార్మికులకు ప్రభుత్వం నుంచి భద్రతతో కూడిన భరోసా, సమాజం నుంచి గౌరవంతో కూడిన ప్రతిస్పందన అవసరం. శక్తికి మించి సేవలందించటానికి, సొంత లాభం మానుకొని సమాజం కోసం పాటుపడటానికీ ఇటువంటి మానవీయ బాసట ఎంతగానో ప్రేరణనిస్తుంది. కానీ, ఇప్పుడేం జరుగుతోంది? ముందస్తు సన్నద్ధత, శాస్త్రీయ దృష్టీ లేని పాలక పెద్దలు దేశ ప్రజల ప్రాణాలను కోవిడ్‌ గాలికి వదిలేసినట్టే-ఈ సమరంలో ముందు వరసలో అహర్నిశలూ పోరాడుతున్న వైద్య శ్రేణులనూ నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఒక్క కోవిడ్‌ రెండో విడత అలజడికే దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది సిబ్బందీ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరి విలువైన ఈ త్యాగాలకు లభిస్తున్న గౌరవం ఏమిటి ?
    వైరస్‌ పుట్టుక నుంచి దాని వ్యాప్తి, ఉధృతి, నివారణ వరకూ స్పష్టమైన, శాస్త్రీయమైన సమాచారాన్ని అందించిందీ, అందిస్తున్నదీ ఆధునిక పరిశోధనా విభాగాలతో కూడిన వైద్యరంగం. ఇలాంటి మహమ్మారుల వ్యాప్తి సమయంలో ప్రజల్లో ఆధునిక వైద్యం పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు పూనుకోవాలి. కానీ, మోడీ జమానాలో అనేకమంది బిజెపి ప్రతినిధులు అత్యంత మూఢత్వంతో కూడిన భావాలను ప్రచారం చేసి, కోవిడ్‌ వైరస్‌ని అరికట్టే పనిని ఓ విదూషక ప్రహసనంగా మార్చేశారు. ఆధునిక విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అనివార్య తరుణాన్ని గోమూత్ర పానాలతో, పేడ స్నానాలతో, తప్పెట్లూ చప్పట్లూ వంటి చౌకబారు విన్యాసాలతో అపహాస్యం చేశారు. ఈ నేపథ్యంలోనే కాషాయ దళ అనుంగు బాబా రామ్‌దేవ్‌ తెచ్చిన కరోనిల్‌ను కరోనాకు తిరుగులేని మందుగా ప్రచారం చేశారు. ఈ తతంగాలు సహజంగానే కోవిడ్‌ను అడ్డుకోకపోగా, దేశవ్యాప్తంగా వైరస్‌ విరుచుకుపడటానికీ, లక్షల ప్రాణాలు పోవటానికీ, కోట్లాది కుటుంబాలూ అల్లకల్లోలంలో చిక్కుకుపోవటానికీ తమ వంతు తోడ్పడ్డాయి. బిజెపి అండదండలు ఉన్న రామ్‌దేవ్‌ అల్లోపతి వైద్యాన్ని, దానిని అనుసరిస్తున్న వైద్యులను హేళన చేస్తూ, మాట్లాడాడు. దానిని అందిపుచ్చుకొన్న కాషాయ అనుయాయులు వైద్యుల మీద విష ప్రచారానికీ, దాడులకు తెగబడ్డారు. అత్యంత విషమ పరిస్థితుల్లో దేశానికి ఊపిరి పోస్తున్న వైద్యులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ఒకపక్క ప్రాణాలకు తెగించి, కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులు ... తమ మీద బాబా ఒకడు బరి తెగించి మాట్లాడితే- దానికి నిరసన చెప్పుకోవటానికి వీధుల్లోకి రావాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్ల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికుల గురించి బిజెపి ఎప్పుడూ ఉద్వేగ స్వరంతో మాట్లాడుతూ ఉంటుంది. యుద్ధక్షేత్రంలో సైనికులు ప్రాణాలు కోల్పోతే వారికి అత్యంత గౌరవంతో దేశం నివాళ్లు అర్పిస్తుంది. ప్రభుత్వం సాహస పురస్కారాలతో గుర్తించి, గౌరవిస్తుంది. అవన్నీ చేయాల్సిందే! కానీ, దేశం లోపల ఏడాది కాలంగా ప్రజల ప్రాణ రక్షణ కోసం అలుపెరక్కుండా పోరాటం చేస్తున్న వైద్యుల సేవలకు తగిన గుర్తింపు లేకపోగా అవహేళనలూ, అవమానాలూ ఎందుకు? సైనికుల త్యాగాలను కీర్తిస్తూ పక్క దేశాలను విమర్శిస్తూ దేశభక్తి పేరుతో రాజకీయ లబ్ధి పొందటానికి ఉన్నంత సౌలభ్యం ... వైద్యుల త్యాగాల్లో లేదని భావించటం వల్లే అనుకోవొచ్చా?