Apr 26,2023 22:50

విలేకర్లతో మాట్లాడుతున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : అవినీతి చేసి ఓటమి పాలైన వాళ్లు తనపై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు పెదకూరపాడులో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెప్పారని, అయితే టిడిపి హయాంలో అచ్చంపేట మాదిపాడు మినహా ఒక రోడ్డు కూడా వేయలేదని అన్నారు. తాను నాలుగేళ్లలో రూ. 1377 కోట్లతో సంక్షేమ పథకాలు, రూ.655 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని, వీటి లెక్కలు తాను చెబుతానని, చంద్రబాబు చెప్పిన వాటికి వారి వద్ద లెక్కలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో ఇసుక తవ్వకాల వల్ల 28 మంది చనిపోగా ఆ పాపాన్ని తనకు అంటగట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ రూ.100 కోట్లు ఫైన్‌ వేసింది టిడిపి హయాంలోనే అని చెప్పారు. ఇటీవల అమరావతి మండలంలో ఇద్దరు చనిపోవడానికి కారణం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ చేయించిన తవ్వకాల వల్లేనన్నారు. పెదకూరపాడు నియోజవకర్గంలో అమరావతి - బెల్లంకొండ డబుల్‌ లేన్‌ రోడ్డు, అమరావతి - తుళ్లూరు రోడ్డు తామే వేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదన్నారు. పెదమద్దూరు బ్రిడ్జి నిర్మాణ పనులు కనిపించలేదా అని ప్రశ్నించారు. కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్నామన్నారు. చంద్రబాబుకు వయసుతో పాటు ఛాదస్తం పెరిగిందని, తన పేరును కూడా అవమాన పరిచేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు. చినపిచ్చయ్య అందించిన అబద్ధపు వివరాలతో పెదపిచ్చయ్య ఆరోపణలు చేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటన పెద్ద ఫెయిల్‌ అని.. జనం రాకపోవడంతో ప్రస్టేషన్‌లో విజ్ఞత మర్చిపోయి మాట్లాడారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని మళ్లీ చెబుతున్నారని.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. జగనన్న పాలనలో ఆదాయం లేదంటున్న చంద్రబాబుకు.. జీడీపీ, జీఎస్టీల్లో రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. గతంలో విజన్‌ 2020 అని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు విజన్‌ 2047 అనడంపై జనమే నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు.