అతనికి ఆర్మీలో చేరాలనే కోరిక బలంగా ఉండేది. అందుకోసం ఎంతగానో కష్టపడ్డారు. అయినా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో తన కలను నెరవేర్చుకోలేకపోయారు. దాంతో నిరుత్సాహానికి గురైన ఆ యువకుడు తనలా మరొకరు కాకూడదని అనుకున్నారు. అందుకోసం తానే స్వయంగా 'అచీవర్స్ అకాడమీ'ని స్థాపించారు. ఆర్మీ, పోలీసు పరీక్షలకు ప్రిపేరవుతున్న వందలమంది విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ను ఇస్తూ.. వారి గెలుపునే తన గెలుపుగా భావిస్తున్నారు. అతనే మైసూరుకు చెందిన 39 ఏళ్ల ప్రొఫెసర్ డాక్టర్ రాఘవేంద్ర ఆర్. స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడుపుతున్న ఆయన ప్రస్థాన పరిచయం ఇది.
మాండ్య జిల్లాలోని శేషాద్రిపురం డిగ్రీ కళాశాలలో డాక్టర్ రాఘవేంద్ర ఆర్ 'నేషనల్ సర్వీస్ స్కీమ్ కో-ఆర్డినేటర్'గా పనిచేస్తున్నారు. అతనికి స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ, ఏదో కోల్పోయాననే బాధ వెంటాడుతూనే ఉండేది. తనలా మరొకరు కాకూడదనే ఉద్దేశ్యంతో వందలమందికి మార్గదర్శకునిగా మారారు. 'వాస్తవానికి ఆర్మీలో చేరాలనేది నా చిన్ననాటి కల. అందుకోసం ఉదయాన్నే లేచి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఎంతగానో కష్టపడేవాడిని. ఎలాగైనా 2000-2001లో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించాలి అనుకున్నా. కానీ వైద్య పరీక్షల్లో విఫలమయ్యా. అది తప్పనిసరి అర్హత అని తెలీదు. యుక్త వయస్సులో చేసిన ఒక తప్పువల్ల నా దంతాలు తొలగించబడ్డాయి. ఆర్మీలో వైద్య పరీక్షల్లోనూ నెగ్గాలనే విషయం ముందుగానే తెలిసి ఉంటే, మొదటి నుంచి జాగ్రత్తగా ఉండేవాడ్ని. అది తెలియనందువల్ల సమయమూ, కష్టమూ వృథా అయ్యాయి. ఇంకా హ్యాండ్‌బాల్ బాగా ఆడతాను. అనేక రాష్ట్రస్థాయి ఈవెంట్‌లలో రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నాను. దాంతో అథ్లెట్‌ని కావాలనే కోరిక నాలో బలంగా నాటుకుంది. కానీ జాతీయ స్థాయి ప్లేయర్‌ను కావాలంటే ఏమి చేయాలి? అనేది తెలిసేది కాదు. సలహాలివ్వడానికి స్నేహితుల్లో ఎవరూ లేరు. అలా ఆర్మీలో చేరాలనే, అథ్లెట్ కావాలనే కోరిక తీరలేదు. నాలా మరెవ్వరూ బాధ పడకూడదనుకున్నా. అచీవర్స్ అకాడమీని స్థాపించా. దీనిద్వారా కొన్ని వందలమంది పోటీ పరీక్షలకు అర్హత సాధించడానికి, సహాయపడాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే ఉచిత శిక్షణ ఇస్తున్నా' అంటున్నారు రాఘవేంద్ర.
ఇతరుల విజయంతోనే ఆనందం
'నేను గ్రాడ్యుయేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పిహెచ్‌డి చేశాను. ఖాళీ సమయాలలో విద్యార్థులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ఇంజినీరింగ్, వివిధ విభాగాలకు చెందిన కళాశాల విద్యార్థులను సంప్రదించి, ఈ అకాడమీని ప్రారంభించాను. చాలామంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొన్ని సమయాల్లో, సరైన సబ్జెక్టులను ఎలా ఎంచుకోవాలో?, దరఖాస్తు ఫారమ్‌ను సరిగ్గా ఎలా పూరించాలో? వారికి తెలియదు. అలాంటి వారందరినీ దృష్టిలో ఉంచుకుని 2013లో ఈ అకాడమీని స్థాపించా. ఇంకా మారథాన్‌ల వంటి ఫిట్‌నెస్ శిక్షణను ఇస్తాను. రోజుకు 12 కి.మీ. వారిచేత పరుగులు తీయిస్తూ ఉంటా. కొందరు విద్యార్థులకు శారీరక పరీక్షకు హాజరు కావడానికి బూట్లు లేవు. మరికొందరికి తగిన దుస్తుల కోడ్‌కు సరిపోయే బట్టలు లేవు. ఇంకొందరికి ప్రయాణానికి డబ్బు ఉండదు. అలాంటి వారికి కొందరి దాతల సాయంతో ఇప్పటి వరకు దాదాపు మూడువేల మందికి పైగానే సాయపడ్డా. ఈ తొమ్మిదేళ్లల్లో నా దగ్గర కోచింగ్ తీసుకున్న 200 మంది విద్యార్థులు ఆర్మీ, పోలీసు ఉద్యోగాలను సాధించారు' అంటున్నారు రాఘవేంద్ర.
ప్రకటన ద్వారా తెలుసుకున్నా
'నాకు పోలీస్ సబ్- ఇన్‌స్పెక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. కానీ అందుకోసం ఏమి చేయాలి? అనేది తెలిసేది కాదు. వార్తాపత్రికలో ప్రకటన ద్వారా ఈ అకాడమీ గురించి తెలుసుకున్నా. ఇక్కడ ఆరునెలల నుంచి శిక్షణ తీసుకుంటున్నా. ఇది నాలోని సత్తువ, శరీరాకృతిని పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడింది. ఫిజికల్ రౌండ్‌ను ఈమధ్యే క్లియర్ చేశా. త్వరలో రాత పరీక్షకు హాజరవుతా. నామీద నాకు నమ్మకాన్ని నింపిన రాఘవేంద్ర సార్‌కు రుణపడి ఉంటా' అంటోంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిసర్గ కెఎస్.
'ఇప్పటిలానే భవిష్యత్తులోనూ విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులూ వసూలు చేసే ఉద్దేశ్యం లేదు. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జీవితం చాలా చిన్నది. మనం దానిని మధురంగా మార్చుకోవాలి. యువ తరానికి వారి కలల కెరీర్‌ను నిర్మించుకోవడంలో సహాయం చేయడం సంతోషంగా ఉంది' అంటున్నారు డాక్టర్ రాఘవేంద్ర.