కాశ్మీర్‌లో అందరూ ఈ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఇందులో విశేషం ఏముందీ, వధూవరులులిద్దరూ కొద్దిగా వయసు మీరిన వాళ్లు.. అంతేకదా అనుకోవచ్చు. కాదు, ఇంకా చాలా ఉంది.
ఆమెకు గతంలో పెళ్లి అయిన ఆరు రోజులకే కట్నం ఎక్కువ కావాలని అడగటంతో ఆ పెళ్లిని తెగతెంపులు చేసుకొన్నది. ఇది ఆమెకు రెండో పెళ్లి. అంతటితో ఈ పెళ్లి ప్రత్యేకత ఆగిపోలేదు. అతనికి 23 సంవత్సరాల క్రితం ఇంకో యువతితో జరగాల్సిన పెళ్లి అది. ఈ 23 సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు.
శ్రీనగర్‌కు చెందిన 23 ఏళ్ల ఆలీ మహమ్మద్ భట్ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారంలో సహాయం చేయటానికి నేపాల్ వెళ్లాడు. అప్పటికే అతని పెళ్లి గురించి ఇంట్లో మాటామంతీ జరుగుతున్నాయి. త్వరలో తిరిగి వచ్చి అతను పెళ్లి చేసుకోవాల్సి ఉంది.
అప్పుడే రాజస్థాన్‌లోని జైపూర్ ఆగ్రా రహదారిలో సామ్లేటి గ్రామం దగ్గర ఒక బస్సులో బాంబు బ్లాస్ట్ జరిగి 14 మంది చనిపోయారు.. 34 మంది గాయపడ్డారు. ఆ కేసుకు జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కు సంబంధం ఉందంది దర్యాప్తు వ్యవస్థ. పోనీ జేకేఎల్‌ఎఫ్ వారినైనా అరెస్టు చేసిందా అంటే అదీ లేదు.
వాళ్ల దృష్టిలో కాశ్మీరీ ఎవరైనా ఉగ్రవాదే. నేరుగా నేపాల్ వెళ్లి అద్దె ఇంటిలో ఉంటున్న ఆలీభట్‌ను అరెస్టు చేసి, తీసుకొని వచ్చింది. అలాంటి వాళ్లనే ఇంకో ఐదుగురిని శ్రీనగర్ నుండి పట్టుకొచ్చింది. ఆగ్రా నుండి బేగ్‌ను పట్టుకొచ్చింది. కోర్టులో కలుసుకునే దాకా వారు ఒకరికి ఒకరు తెలియదు. మొత్తం 12 మంది మీద కేసులు పెట్టింది.
వారిలో అతి చిన్నవాడు మిజ్రా నిసార్ హుస్సైన్. 17 ఏళ్లకే జైల్లో పడ్డాడు. మొదటి షేవ్ జైల్లోనే చేసుకున్నానని చెబుతున్నాడు. అతని యవ్వనకాలమంతా 10×10 గదిలో గడిచిపోయింది. అతని అన్నను కూడా అరెస్టు చేసి, 14 సంవత్సరాలకు వదిలి వేశారు. 'నా హృదయం మరుభూమి అయిపోయింది' అంటాడు మిజ్రా.
వీళ్లందర్నీ నేరం రుజువు చేయకుండా రెండున్నర దశాబ్దాలు జైల్లో ఉంచారు. 'కాశ్మీరీలకు ఈ కేసుతో సంబంధం లేదు' అని స్వయంగా పోలీసులూ కోర్టులో సాక్ష్యం చెప్పారు. కామిని జైస్వాల్ అనే మహిళా లాయర్ వీరి కేసు గురించి 23 సంవత్సరాలు వాదించింది. డాక్టర్లకే కాదు, లాయర్లకూ గుండె ధైర్యం మెండుగా ఉండాలి. డాక్టర్లు ప్రాణం పోవటం నేరుగా కళ్లతో చూస్తారు. లాయర్లు న్యాయం చనిపోవటాన్ని, పర్యావసానంగా బతుకులు ఛిద్రమవటాన్ని మనసుతో చూస్తారు.
ఎట్టకేలకూ వీరిని 2019 జులైలో విడుదల చేశారు. శ్రీనగర్ వచ్చిన ఆలీభట్ నేరుగా శ్మశానానికి వెళ్లి తల్లిదండ్రులు సమాధులపై పడి ఏడ్చాడు. ఆ దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన మనసున్న వారందరూ కదిలిపోయారు.
'ఎవరైనా ముస్లిములు అరెస్టు అయితే వాళ్లు ఏదో తప్పు చేసి ఉంటారనుకొనేవాడ్ని. ఈ అభిప్రాయం నేను అరెస్టు అయ్యేంతవరకూ ఉండింది' అని చెప్పాడు ఆలీభట్. ఆలీ జైల్లో ఉన్నప్పుడే అతని చెల్లికి పెళ్లి అయి, ఆమెకు పుట్టిన కొడుకుకీ పెళ్లీడు వచ్చింది.
శిథిలమైన జీవితాన్ని పునర్నిర్మించే ప్రయత్నం అతని తోబుట్టువులు చేశారు. కూలిపోయిన మానుకైనా చిగురులు వస్తాయి కదా! మానసికంగానూ ధ్వంసమై, తల్లీదండ్రీ లేని ఇంట్లో రాత్రిళ్లు ఇంకా జైలు సెల్‌లో ఉన్నట్లే కలలు కనే ఆలీ చేత అతని తమ్ముడు ఒక షాప్ పెట్టించాడు. చెల్లి ఒక సంబంధం తెచ్చింది.
తాను ఎవరినైనా ఇక ప్రేమించగలనా అనే ఆలీ సందేహాన్ని రుబియా తీర్చింది. అతన్ని ఇష్టపడింది. సాదాసీదా దుస్తుల్లో అతి తక్కువ మాట్లాడే రుబియాతో నాలుగు గంటలు మాట్లాడి, ఆమె ప్రేమలో పడ్డాడు ఆలీ. జైల్లో తన జీవితం గురించి అతను చెబితే, విఫలమైన తన పెళ్లి గురించి ఆమె చెప్పింది. ఒకటి రాజ్యవ్యవస్థ వైఫల్యం, ఇంకొకటి సామాజిక వ్యవస్థ వైఫల్యం. ఇద్దరు బాధితులూ ఒకరి పరాజయాన్ని ఒకరు అర్థం చేసుకున్నారు.
'నా కలలన్నీ ధ్వంసమయ్యాయి. నేనిప్పుడు అందమైన యువరాజును కాను. కానీ నిన్ను సంతోషంగా ఉంచటానికి ఏమైనా చేస్తాను' అని చెప్పాడు ఆలీ. 'అందరి ముందూ ఆమెను 'ఫాతిమా జీ!'' అంటాను. ఎవరూ లేనపుడు ''మేరీ జాన్'' అంటాను. ఆమె సిగ్గు పడుతుంది' అని తన ప్రేమ కబుర్లు చెబుతున్నాడు ఆలీ.
ఫోటోలో కనిపిస్తున్న అతని నవ్వులో ఉన్న సంతోషం వెనుక బడబాగ్నుల గతం ఉంది. గతాన్ని భూస్థాపితం చేసి, జీవితాన్ని వెలిగించుకోవాలనే ఇచ్ఛ ఉంది. అయితే దానికోసం ఆయన చాలా మర్చిపోవాలి.
చేయని నేరానికీ, అసలు ఏ నేరమో తెలియకుండా 23 ఏళ్లు జైల్లో పెట్టిన దుర్మార్గాన్ని మర్చిపోవాలి. తన మీద దిగులు పెట్టుకొని చనిపోయిన తల్లి దుఃఖాన్ని, ఆ మరణం తనకు కలిగించిన గుండెకోతనూ మర్చిపోవాలి. కొంతకాలానికి అదే మనాదతో చనిపోయిన తండ్రి తాలూకూ దుఃఖాన్ని మర్చిపోగలగాలి. ఒక పార్శ్వంలో దాన్ని వేరుగా మోయగలగాలి. అవన్నీ ఆయన చేయగలగాలనీ, మిగిలిన కాలమైనా అతనికీ, ఆమెకు సంతోషాన్నీ ఇవ్వగలిగే రోజులు రావాలని కోరుకొందాం. ఇక వారి బతుకును వాళ్లు బతకనిస్తారని ఆశిద్దాం.