ప్రజాశక్తి- భీమునిపట్నం : జివిఎంసి రెండు, మూడు వార్డుల్లో కమిషనర్ రాజాబాబు గురువారం పర్యటించారు. డంపింగ్ యార్డు, చిల్లపేట చెరువును ఆయన పరిశీలించారు. డంపింగ్ యార్డు ఉండడం వలన సమీప ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారిలక్ష్మి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిల్లపేట చెరువుకు అవుట్‌లెట్ లేనందున మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోందని, అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆమె వివరించారు. మూడో వార్డు పరిధి బోయివీధిలో ఉన్న తీరాన్ని ఆయన పరిశీలించారు. తీరం కోతకు గురికాకుండా, లైట్ హౌస్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని మత్స్యకార నాయకులు గంటా నూకరాజు కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఎస్ వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బి మహాలక్ష్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.










