ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ప్రతి వార్డులోనూ రోడ్లు, డ్రెయినేజీ ఏర్పాటు చేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తామని మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి నాయకులు జయ మనోజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో 31వ వార్డు ఇన్‌ఛార్జీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో రూ.10.50 లక్షలతో నూతన డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఛైర్మన్ శాంత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని, ముఖ్యంగా గతంలో ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించుకోవాలని కోరారు. అందరూ అక్రమ కట్టడాలను తొలగించాలని కోరుతున్నారే తప్ప అందుకు సరైన సహకారం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజల సహకారం లేనిదే ఎలాంటి పనులు అభివృద్ధి చేయలేమని, అభివృద్ధి పనులకు, అక్రమ కట్టడాల తొలగింపునకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించాలంటే అక్రమ కట్టడాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైందని, వరదనీరు ఇళ్లల్లోకి పొంగిపొర్లకుండా పూడిక తొలగించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. తొలగింపునకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి, కౌన్సిలర్లు ఫయాజ్ అహ్మద్, కాంట్రాక్టర్ జయపాల్, మమ్ముత్తు స్వామి ఉన్నారు.
మురుగు కాలువలో పూడిక తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్న మహిళ










