విజయవాడ నగరంలో ఆరేడు వారాలుగా ముఠా కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి, కూలి రేట్లు పెంచుకున్నారు. సిఐటియు, ఎఐటియుసి అనుబంధ ముఠా కార్మిక సంఘాలు కార్మికులకు అండగా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి, ఆయా రంగాల్లోని కార్మికులకు కూలిరేట్లు పెంపులో కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. కేంద్రంలోని బిజెపి-మోడీ ప్రభుత్వం 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చటం కారణంగా వ్యాపారుల శ్రమ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఫలితంగా అసంఘటితరంగ కార్మికులకు కనీస కూలిరేట్లు పెంచకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. అసంఘటితరంగంలోని ముఠా కార్మికులు చేసే వివిధ రకాల వస్తువులు/ సరుకుల క్రయ, విక్రయాల (గూడ్స్) లోడింగ్ -అన్‌లోడింగ్ కారణంగా జిఎస్‌టి రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్లు రాబడి వస్తున్నా... సదరు వ్యాపారులకు లాభాల రూపంలో కోట్లాది రూపాయలు పోగవుతున్నా...కార్మికుల జీవితాల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేసి, పని భద్రత కల్పించి, గుర్తింపుకార్డులు, ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి సదుపాయాలు, రూ.10 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు, ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలని అనాదిగా కార్మికవర్గం, సిఐటియు, ఎఐటియుసి లాంటి సంఘాల నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నా... ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇదే అదునుగా ఇటీవల కాలంలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కూలి రేట్లు పెంచడానికి విముఖుత చూపుతున్నారు. విజయవాడ లాంటి నగరంలో కూలిరేట్ల పెంపులో అనాధిగా వస్తున్న సాంప్రదాయాలను పాటించకుండా, నెలవారీ జీతానికి పెట్టుకుంటామని, వలస కార్మికులతో పని చేయించుకుంటామని, పని గంటలు పెంచుతామని, కార్మికుల సంఖ్యను తగ్గిస్తామని కార్మికులను వ్యాపారులు అదిరిస్తూ, బెదిరిస్తున్నా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నా ...చట్టాల్లో వచ్చిన మార్పుల నేపధ్యంలో కార్మిక శాఖాధికారులు అటు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది. రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేస్తున్నా సాదర ఖర్చులన్నీపోయి, చివరకు మిగిలే డబ్బులతో కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని కార్మిక వర్గం, కార్మిక సంఘాల నేతలు
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో కేజి రూ. 80 నుంచి 90 వరకు ఉన్న కంది పప్పు నేడు రూ. 160 వరకు అమాంతంగా పెరిగింది. అలాగే శనగనూనె రూ. 85 నుంచి 90 ఉంటే నేడు రూ. 175, మినపప్పు రూ. 80 నుంచి 130కు పెరిగింది. టమాట నిన్న మొన్నటి వరకు సెంచరీకి పైగా ధర పలికింది. కనీసం నగరంలో ఇంటి అద్దెలు చెల్లించలేక విజయవాడకు దూరంగా కార్మికులు నివాసముండాల్సి వస్తోంది. ఇటువంటి నేపధ్యంలో పెరిగిన ధరలకను గుణంగా ముఠా కార్మికులకు వ్యాపారులు కూలిరేట్లు పెంచా ల్సి ఉంది. ప్రతి రెండు సంవత్స రాలకు తప్పని సరిగా కూలిరేట్లు పెంచే సాంప్రదాయం విజయవాడ నగరంలో అనాధిగా వస్తూనే ఉంది. కానీ వ్యాపారులు మొండికేయడంతో చేసేది లేక సిఐటియు అనుబంధ ముఠా కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని గత జూన్ 28 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ముఠా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కో కన్వీనర్ ఎం.సీతారాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు చిగురుపాటి బాబూరావు, డివి కృష్ణ, నాయకులు దోనేపూడి కాశీనాధ్, బోయి సత్యబాబు, ఎం బ్రహ్మ య్య, ఎంవి సుధాకర్, కె.దుర్గారావు, ఎఐటి యుసి నాయకులు ఎం.సాంబశివ రావు, ఇ.నాగేశ్వరరావు నేతృత్వంలో గత నెలన్నర రోజుల నుంచి వందలాది మంది కార్మికులను కలుపుకొని నగరంలోని ఆయా ప్రాంతాల్లో గ్రూపు మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీ, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, వ్యాపారులతో రాయ భారాలు తదితర రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. గవర్నర్‌పేట, వన్‌టౌన్‌లోని ఆయా రంగాల్లోని ముఠా కార్మికులు రూపాయికి 10 నుంచి 12 పైసల వరకు కూలి రేట్లు పెంచుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రంగాల్లోని ముఠా కార్మికులకు కూడా వ్యాపా రులు సాంప్రదాయ పద్ద్ధతిలో కూలిరేట్లు పెంచాలని, లేనట్లయితే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు.
మునిసిపల్ కార్మికుల మహా ధర్నా...
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆప్కాస్ విధానంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఈ వారంలోనే ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. మునిసిపల్ కార్మికులకు సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా 20 లక్షలు చేయాలని, పనిభారం తగ్గించాలని తదితర డిమాండ్స్ పరిష్కారం కోరుతూ ఈ వారంలో ఎపి మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో వందలాది మంది కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అనంతరం సామూహిక రాయభారాలతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుకు నేతలు వినతిపత్రాలను అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది. కార్మికవర్గం పోరట పటిమను ప్రదర్శించారు. నేతల ప్రసంగాలు కార్మికవర్గాన్ని ఆలోచింప చేశాయి. న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మునిసిపల్ కార్మికులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
- రాజు










