Nov 09,2023 00:47

మాచర్ల మండలంలోని పత్తిపొలం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో మూడ్రోజులుగా జల్లులతో కూడిన వర్షం కొనసాగుతోంది. గత 40 రోజులుగా వర్షం లేక ఇబ్బంది పడుతున్న రైతులకు తాజా వర్షాలు ఎంతో ఊరటనిచ్చాయి. పల్నాడు, గుంటూరు జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. తెనాలిలో ఒక మోస్తరు వర్షం కురిసింది.
పల్నాడు జిల్లాలో మిర్చి, పత్తికి ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నీటి ఎద్దడితో అల్లాడుతున్న మిర్చి పైరుకు వర్షం ఊపిరిపోసింది. ఈ వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఒక తడి పెట్టినంతగా ఉపయోగపడిందని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, గురజాల, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, పెదకూరపాడు, రాజుపాలెం, నకరికల్లు, వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నర్సరావుపేట, చిలకలూరిపేట తదితర మండలాల్లో మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయిలు ఖర్చుపెట్టి ఆయిల్‌ ఇంజన్లు, ట్రాక్టర్ల ద్వారా పైర్లకు కడవలతో నీరుపెట్టిన దుర్భర పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడ్డార. గురటూరు జిల్లా పరిధిలో డెల్టాలో కూడా బుధవారం కురిసిన వర్షంతో కరువు సమస్య తాత్కాలికంగా తొలగిపోయింది. అయితే వరిపొట్ట దశలో ఉన్నందున ఎక్కువగా వర్షం కురిసి ముంపు సమస్య ఏర్పడితే కొంత నష్టం జరగవచ్చునని భావిస్తున్నారు. పత్తి కాయలు, పూత రాలిపోయే ప్రమాదం ఉంది. తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసి రాలిపోతుందన్న ఆందోళనా లేకపోలేదు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు మెరుగ్గా కురవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ప్రస్తుతానికి తొలగిపోయినట్టేనని చెబుతున్నారు.
తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వేళ పలు పట్టణాల్లో కుండపోతగా వర్షం కురవడం, రోడ్లపైకి నీరు, కాల్వల్లోని మురుగు నీరు పారడం వల్ల ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. ప్రధానంగా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు, ప్రయాణం నుంచి తిరిగి వచ్చే వారు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షంతో గుంటూరు మిర్చి యార్డులో బయట ఉంచిన బస్తాలు కొంత వరకు తడిశాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఆకస్మికంగా కురిసిన వర్షంతో రైతులు ఆదరబాదరగా మిర్చి టిక్కిలు షెడ్డుల్లోకి మార్చుకున్నారు. అలాగే ఆరుబయట ఆరబోసిన మిర్చిని కూడా గోతాల్లోకి ఎత్తుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు.