May 20,2023 22:50

విద్యుత్‌ లైనుకు మరమ్మతులు చేపడుతున్న రైల్వే సిబ్బంది (ఇన్‌సెట్‌లో ... అంతరాయానికి కారణమైన కోతి)



- గంటన్నరపాటు ఆగిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
ఒక వానరం విద్యుత్‌లైన్‌పై దూకడంతో విద్యుత్‌ తీగ తెగిపడిన సంఘటనతో విశాఖపట్నం నుండి విజయవాడకు వెళ్లే రత్నాచల్‌ ఎక్స్ప్రెస్‌ శనివారం సాయంత్రం గంటన్నర పాటు సామర్లకోట రైల్వే స్టేషన్‌ శివారులో నిలిచిపోయింది. రైలు నడిచేందుకు ప్రధాన ఇంధనం అయిన విద్యుత్‌ వైరు తెగిపోవడంతో సమస్య ఏర్పడి రత్నాచల్‌ ఎక్స్ప్రెస్‌ కు అంతరాయం ఏర్పడింది. దీంతో విశాఖపట్నం విజయవాడ మధ్యలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సామర్లకోట రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రమేష్‌ తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న రత్నాచల్‌ ఎక్స్ప్రెస్‌ సామర్లకోట రైల్వే స్టేషన్‌ను వదిలిపెట్టిన తర్వాత హుస్సేన్‌పురం వద్ద గల వెంకటరామా ఆయిల్‌ మిల్లు వద్ద ఒకకోతి విద్యుత్‌ లైన్‌ పైకి దూకడంతో విద్యుత్‌ వైరు కున్న జాయింట్‌ కనెక్షన్‌ వైరు తెగిపోయి రైలు అక్కడి కక్కడే నిలిచిపోయింది. లోపాన్ని గుర్తించిన రైల్వే అధికారులు సీనియర్‌ సెక్షన్‌ ఇన్‌చార్జ్‌ (ఓహెచ్సి) అప్పారావు ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన తెగిన విద్యుత్తు లైనుకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మత్తులకు సుమారు గంట 35 నిమిషాలు సమయం పట్టింది. మరమ్మతులు పూర్తి చేసిన తదుపరి రత్నాచల్‌ ఎక్స్ప్రెస్‌ విజయవాడ వైపు పంపించారు. ఈ అంతరాయం వల్ల ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అంతరాయానికి కారణమైన కోతికి ఎలాంటి ప్రమాదానికి గురికాకపోవడం కొసమెరుపు.