
వర్షకాలం పూర్తవుతున్నా లోటు వర్షపాతమే
ఆగస్టు, సెప్టెంబర్‌లోనూ పడని వర్షాలు
భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
ఎక్కడికక్కడ అడుగంటిన చెరువులు
పంటలపై రైతుల్లో ఆందోళన
మెట్టలో రబీకి ఇబ్బందులు తప్పవంటున్న అన్నదాతలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
వర్షాకాలం పూర్తవుతున్నా.. సరైనా వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయసాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు లేక ఇప్పటికే మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన పంటలు గట్టెక్కుతాయో లేదో తెలీక రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రభావం రబీలోనూ వెంటాడతుందని రైతుల్లో గుబులు నెలకొంది. జూన్, జులై, ఆగస్టు సెప్టెంబర్ నాలుగు నెలలు వర్షాకాలం. ఒక్క జులై నెలలో తప్ప మిగిలిన మూడునెలలు జిల్లాలో లోటువర్షపాతమే నమోదైంది. ఆగస్టులో 238.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 90.9 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో 62 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. సెప్టెంబర్ నెలలోనైనా వర్షాలు పడతాయని అంతాభావించారు. ఈనెల మొదటి వారంలో వర్షాల వారంగా వాతావరణశాఖ ప్రకటించినప్పటికీ జిల్లాలో సరైనా వర్షాలు కురవలేదు. మరో పదిరోజుల్లో వర్షాకాలం పూర్తి కానుంది. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకూ 109.5 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 78.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. రాబోయే పదిరోజుల్లో కూడా వానలు పడే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఈ ఏడాది వర్షభావ లోటు తప్పదని తేలిపోయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రెండు జిల్లాల్లోనూ దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టారు. డెల్టాలో కాలువల సాగులో ఉన్న భూములకు ఇబ్బంది లేకపోయినప్పటికీ మెట్ట ప్రాంతంలో రైతులు మాత్రం వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరు జిల్లాలో గడిచిన పదోతేదీనాటికి 91శాతం సాగుభూమిలో మాత్రమే వరినాట్లు పడ్డాయి. దాదాపు 13 వేల ఎకరాల్లో నాట్లు పడలేదు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో నాట్లు పడ్డాయో లేదో అధికారులు వెల్లడించలేదు. చింతలపూడి, ద్వారకాతిరుమల, వంటి అనేక మండలాల్లో వర్షాల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడే చెరువులు ఎండిపోవడంతో పశువులకు తాగునీరు సైతం ఇబ్బందికరంగా మారింది. వర్షాభావలోటుతో జిల్లాలోని భూగర్భజలాలపై తీవ్రప్రభావం చూపుతుందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో రబీలో పెద్దఎత్తున రైతులు వివిధ పంటలను సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భూగర్భజలాలు తగ్గిపోవడంతో వ్యవసాయ బోర్లు నుంచి నీరు సరిగా రావడంలేదని గగ్గోలు పెడుతున్నారు. రబీ సాగుపై మరింత ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెలనుంచి మొక్కజొన్న, పొగాకు వంటి పంటలను రైతులు మెట్ట ప్రాంతంలో పెద్దఎత్తున సాగుచేయనున్నారు. సాగునీరు అవసరం పడుతోంది. బోర్ల నుంచి నీరు సరిగా రాకపోతే పంటలు దెబ్బతింటాయని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఎక్కడికక్కడ చెరువులు అడుగంటడంతో ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం అందుకు తగిన విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించి రైతులకు సూచనలు చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.