Nov 02,2023 21:00

కుందూనదిలో తగ్గిన నీరు

చాపాడు : కడప జిల్లాలో కరువు తాండవిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు గణనీయంగా తగ్గింది. రబీ సీజన్‌ను నమ్ముకున్న రైతులకు కన్నీరే మిగులుతుంది. నవంబర్‌ ప్రారంభమైనప్పటికీ వాన జాడ కన్పించకపోవడంతో రైతుల్లో దిగులు ఏర్పడింది. దీంతో పంటలు సాగుచేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు పడతాయన్న నమ్మకంతో పంటలు సాగు చేసిన పంట కళ్లేదుటే ఎండుతుంటే రైతులకు చివరకు కన్నీరే మిగులునుంది. కొందరు ఆశావాహులు రానున్న రోజుల్లో ప్రకతి చల్లగా చూడకపోతుందా నాలుగు చినుకులు రాలక పోతాయా అన్న ఆశతో అవకాశం ఉన్న దారులను చూసుకొని పంటలను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నీటి సేకరణకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో కెసి పరిధిలో ఖరీఫ్‌ సీజన్‌లో 90వేల ఎకరాలలో వరి పంటను రైతులు సాగు చేసేవారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 10వేల లోపు మాత్రమే సాగైంది. రబీలో 50 వేల ఎకరాల మేర ఆరుతడి పంటలను రైతులు సాగు చేపట్టారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కాలువకు నీరు విడుదల కాకపోవడంతో పంటలు ఎండుతున్నాయి. మినుము , పెసర, జొన్న పంటలను సాగుచేసి ఇబ్బందులు పడుతున్నారు. రాజుపాలెం, జమ్మలమడుగు, పెద్ద మోడియం, మైలవరం, ఎర్రగుంట్ల , కమలాపురం, పులివెందుల ప్రాంతాలలో బుడ్డ శనగ పూర్తిగా తగ్గింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూమి పదునుకాకపోవడంతో సాగుకు విరామం ప్రకటించారు. సాగుకు రైతులు ముందుకు రావడం లేదు. చాపాడు మండలంలో 16 వేల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యేది. 5300 ఎకరాలలో మాత్రమే వరి పంట సాగు అయినది. మిగిలిన విస్తీర్ణంలో రబీలో ఆరుతడి పంటలు సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈ పంటలు వర్షం రాక, కెసి నీరు విడుదల కాక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం మాత్రం జిల్లాలో కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణ మని రైతులు పేర్కొంటున్నారు.
అడుగంటిన భూగర్భజలాలు..
వాతావరణం అనుకూలముగా ఉండి అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే రైతుకు గిట్టుబాటు ధర లభించడం కష్టం. ఈ ఏడాది రైతుల పట్ల వరుణుడు జాలి చూపడం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో భూగర్జజలాలు అడుగంటాయి. జిల్లాలో 14 చిన్న, మధ్య తరహా, పెద్ద జలాశయాలు ఉన్నాయి. జల వనరుల నిల్వ సామర్థ్యం 84.489 టిఎంసిలు కాగా 41 టిఎంసిల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రబీలో 4.50 లక్షల ఎకరాలలో ఆరుతడి పంటలు సాగు కావాల్సి ఉంది. కానీ జిల్లాలో సాగు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటపై పెట్టిన లక్షలాది రూపాయలను వదులుకోలేక పలువురు రైతులు కొత్తబోర్లు వేయించారు. 600 అడుగుల లోతులో కూడా చుక్కనీరు లభ్యంకాలేదు. ఒకరిద్దరు రైతులు ఆశకొద్ది రెండు, మూడు బోర్లు తవ్వించారు. కానీ వారి ప్రయత్నం నిరుపయోగమైంది. కెసి కాలువ పరిధిలో గుంతలలో ,వంకలలో మోటర్లు పెట్టి సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
'కుందూ'ను తాకిన నీటి ఎద్దడి..
కుందు నదిలో ప్రతి సంవత్సరం నీరు సమృద్దిగా ప్రవహించేది. సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు దిగువకు ప్రవహిస్తూ పరవల్లు తొక్కేది. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. సెప్టెంబర్‌లో వినా యక చవితి సందర్భంగా నిమజ్జనం సందర్భంలో విగ్రహలు మునిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఈ ఏడాది వారం రోజుల పాటు మాత్రమే నదికి నిండుగా నీరు ప్రవహించింది. ప్రస్తు తం నదిలో నీరు పూర్తిగా అడుగ ంటింది. ప్రస్తుతం నదిలో వంద క్యూసెక్కుల నీరు కూడా ప్రవహి ంచని పరిస్థితి. కుందూ నీటిని ఆధారం చేసుకొని ఎత్తిపోతల పథకాలు, మోటార్ల ద్వారా సుమారుగా 2వేల ఎకరాలలో వరి, ఇతర పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు జెసిబిలను ఉపయోగించి నీటిమడుగుల నుంచి కాలువలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏప్రిల్‌, మే నెలలో కనిపించే పరిస్థితి ప్రస్తుతం నవంబర్‌ నెలలో కనిపిస్తుందని ఇది చాలా అరుదని రైతులు పేర్కొంటున్నారు. కుందూ నదికి నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.కెసి కాలువకు నీటిని విడుదల చేయాలి
కెసి కెనాల్‌ పరిధిలో కాలువకు నీరు విడుదల కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వరి పంట సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని నీరు విడుదల కాకపోవడంతో మినుము జొన్న పంటలు సాగు చేపట్టాం. ప్రస్తుతం కెసి కాలువకు నీరు విడుదల చేసి నిలుపుదల చేశారు. పంటలు ఎండిపోకుండా కాలువకు నీరుని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- భాస్కర్‌ రెడ్డి, రైతు విశ్వనాధపురం, చాపాడు మండలం.
సాగు చేసిన పంటలు ఎండుతున్నాయి
కుందూ నీటి ఆధారంగా వరి వేశాం. నదిలో నీరు తగ్గుముఖం పట్టడంతో పంటకు సరిగా నీరు అందడం లేదు. అధికారులు స్పందించి కుందూకు నీటిని విడుదల చేస్తే వరి పంట పూర్తి అయ్యేవరకు సాగునీరు అందు తుంది. ఈ ఏడాది ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-శాంత రాజు, రైతు, చాపాడు.
కరువు మండలాలుగా ప్రకటించాలి
జిల్లాలో రైతులు వర్షాలు సరిగా పడకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కెసి పరిధిలో రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగుకు చర్యలు చేపట్టి నీరు విడుదల కాకపోవడంతో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను కూడా పంపిణీ చేయలేదు. ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులతో విచారణ జరిపించి కరువు మండలాలను ప్రకటించాలి.
- దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు.