ప్రజాశక్తి-పాడేరు: కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలోగ్గి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో పాడేరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు ఎల్.సుందరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కలిసి ప్రజలపై భరించలేని విద్యుత్ బారాన్ని మోపుతూ మరోవైపు విద్యుత్ స్మార్ట్ మీటర్లు విధానం తీసుకోచ్చి పేద ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సామాన్యులను దోచి కార్పొరేట్ల జేబులు నింపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్దఎత్తున పోరాటమే మార్గమన్నారు. పేదవాడి నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ చార్జీలు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సీపీఎం నాయకులు కూడా రాధా కృష్ణ, చిట్టిబాబు, సింహాచలం, పోతురాజు లక్ష్మణరావు, ప్రభుదాస్, చిన్నారావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని సిపిఎం మండల కార్యదర్శి పి.భీమరాజు తెలిపారు. మండల విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రూ ఆఫ్ సర్దుబాటు చార్జి పేరుతో ప్రజలపై అనవసర పన్నుల భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. పాలకులు, సామాన్య ప్రజల కష్టార్జితాన్ని దోచి కార్పొరేట్లకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ విధానాలతో ప్రజలకు నడ్డి విరుస్తున్నారనీ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రజలందరూ మమేకమై ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల భారాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే.త్రినాథ్, ఎంఎం శ్రీను, జి నారాయణ, కే.నర్సయ్య, జీనబంధు, రాందాస్, డోంబ్రు పాల్గొన్నారు.










