ప్రజాశక్తి-పాడేరు:స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ ఎదుట బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న నిర్వహించనున్న కార్మిక మహా గర్జనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటిక సత్యనారాయణ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించి, ప్రైవేటీకరణను విరమించు కోవాలన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్, స్టీల్ ప్లాంట్, రైల్వే, తదితర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. దీన్ని ప్రజలంతా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఆదివాసి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో ఆదివాసుల భూములు అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని, దీంతో గిరిజనులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమర్, లక్ష్మణ్, రాజశేఖర్, రాధాకృష్ణ, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.










