
ప్రజాశక్తి - నర్సీపట్నం టౌన్
నర్సీపట్నం ప్రాంత భూ పోరాట యోధుడు, వామపక్ష ఉద్యమం నాయకుడు మాకిరెడ్డి ఎర్రినాయుడు అలియాస్ మాకిరెడ్డి (76) గుండె పోటుతో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన మాకిరెడ్డిని విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ (విశాఖ డెయిరీ) అసుపత్రికి తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15న మాకిరెడ్డి నర్సీపట్నం మండలం గబ్బాడలో జన్మించారు. వామపక్ష ఉద్యమం ప్రభావంతో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థి సంఘం ఎఐఎస్‌ఎఫ్ నాయకునిగా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. డిగ్రీ అనంతరం సిపిఐ నాయకునిగా ఆయన అనేక భూ పోరాటాలు నిర్వహించారు. పేదలకు వేలాది ఎకరాల భూమి దక్కడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. నర్సీపట్నం, కోటవురట్ల, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట మండలాలతో పాటు అటు రావికమతం, వి.మాడుగుల మండలాల్లోనూ ఆయన నాయకత్వంలో చేసిన పోరాటాల ఫలితంగా వేలాది మంది పేదలకు వేల ఎకరాలు భూములు దక్కాయి. 1993లో సిపిఎంలో చేరిన మాకిరెడ్డి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. సిపిఎం డివిజన్ కార్యదర్శిగా పని చేసిన ఆయన ఇక్కడ ఉద్యమం విస్తరణకు కృషి చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మాకిరెడ్డి కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ కార్మికులకు కూలి రేట్ల పెంపు కోసం ఉద్యమించారు. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కార్యకర్తగా పలు వేదికల్లో పని చేస్తున్నారు. తుదిశ్యాస వరకు ఆయన పోరుబాట వీడలేదు.
ప్రజా ఉద్యమానికి తీరని లోటు
వామపక్ష ఉద్యమ నేత మాకిరెడ్డి మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాకిరెడ్డి మృతికి సంతాపం, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు రాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వామపక్ష పార్టీలలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన పోడు భూముల పోరాటంలో ఆలు పెరగకుండా పనిచేశారని కొనియాడారు. ఈ ప్రాంత దళిత, గిరిజన, బడుగు బహీన వర్గాల ప్రజల భూ సమస్యలపై పనిచేశారని తెలిపారు. మాకిరెడ్డి మరణం నర్సీపట్నం ప్రాంత ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని రాజు పేర్కొన్నారు.