ప్రజాశక్తి-కాకినాడ పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కాకినాడలో బుధవారం వామపక్ష పార్టీలు చేపట్టిన ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి బూతులు తిడుతూ నాయకులను కించపరిచారు. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలకు చెందిన చెందిన నాయకులను, మహిళా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించుకుని వెళుతున్న సమయంలో ముందు వ్యాన్‌కు అడ్డంగా నిలబడి నిరసన చేపట్టారు. వారిని బలవంతంగా పోలీసులు లాగి వేరే ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కలెక్టరేట్‌కు బయలుదేరుతుండగా పోలీసులు అక్రమంగా మహిళలని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం పోలీసులు చేత కాలరాయిస్తోందంటూ వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పోలీసులకు తీరును నిరసిస్తూ వామపక్ష నాయకులు కొంతసేపు నినాదాలు చేశారు. విపక్ష నాయకులు మాట్లాడుతూ ఆందోళనకారులను డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి బూతులు తిడుతూ అరెస్టు చేశారన్నారు. త్రీటౌన్ సిఐ భగవాన్ మహిళా నాయకురాలను చేతులు వేసి నెట్టి వేయడం చాలా దారుణమన్నారు. ఈ అరెస్టులో పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. శాంతియుత ప్రదర్శనలను, ర్యాలీలను కూడా సహించలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. ఉద్యమకారుల పట్ల పోలీసుల వైఖరిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలన్నారు. పోలీసులు చట్ట పరిధిలో వ్యవహరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అప్రజాస్వామిక నిర్ణయాలను అమలు చేసే యంత్రాంగంగా పోలీసు వ్యవస్థ ఉందన్నారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదన్నారు. ప్రజలపై ధరలబారం, పన్నుల భారం, కరెంటు ఛార్జీల భారం మోపుతున్న ప్రభుత్వాలకు పోలీసులు అండగా ఉంటూ ప్రజల ప్రజాస్వామిక హక్కుల హరిస్తున్నారన్నారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దువ్వా శేషు బాబ్జి, సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేశ్వర్లు, సభ్యుడు ఎం.భైరవస్వామి, కె.నరసింహ, కె.రామకృష్ణ, ఎ.అనుక్ లిబరేషన్ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ, ఎపి రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులడు వి.రాజబాబు, ఎఐఎఫ్‌టియు నాయకులు కె.అంజిబాబు, రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు మలకా వెంకటరమణ, క్రాంతి, ఐద్వా నాయకులు రమణి, పద్మతో పాటు మొత్తం 25 మందిని అరెస్టు చేశారు.










