ప్రకృతిలో మానవ ఉనికికి మొక్కలే ప్రాణాధారం. మధుర ఫలాలు, చక్కని పువ్వులు, చల్లని నీడ, ప్రాణవాయువు, వర్షాలు ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు మొక్కలతో మనకి సమకూరుతున్నాయి. పరిసరాల్లో అక్కడక్కడా కొన్ని ప్రమాదకర మొక్కలూ ఉన్నాయి. వాటిని తాకినా.. వాటి గాలి పీల్చినా అనేక రోగాలు వస్తాయి. ఇంకా అనేక అనర్థాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి ప్రాణహానీ సంభవిస్తుంది. ఇలాంటి మొక్కల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పశువులకు, పంటలకు తీవ్ర నష్టం కలిగించే వాటి గురించి తెలుసుకుందాం !
మొక్కలంటే స్వచ్ఛమైన గాలిని ఇచ్చే ప్రాణవాయువులుగానే మనకు తెలుసు. కానీ వాటిలో కొన్నింటివల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయని మనలో ఎందరికి తెలుసు? అలాంటి విషపూరిత మొక్కల పరిచయం మీకోసం..
పార్ధీనియం..
తెల్లటి ముక్కుపుడకల్లాంటి పువ్వులు మొక్క నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. వీటి ఆకులు సన్నగా డిజైన్ కత్తిరించినట్లు ఉంటాయి. ఇది విషపు మొక్క. దీనిని పార్ధీనియం, కాంగ్రెస్ వీడ్, వయ్యారిభామ, ముక్కుపుడకల మొక్క అనే పేర్లతో పిలుస్తారు. ఇది పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, నీటి చెలమల గట్లమీద, ఆవాస ప్రాంతాల్లో విపరీతంగా పెరిగే కలుపు మొక్క. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి ద్వారా మనదేశానికి వచ్చిన కలుపు మొక్క ఇది. దీనిని పీలిస్తే ఆస్తమా, టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. దీని ఆకు కళ్ళలో పడితే కళ్ళు దెబ్బతిని చూపు కోల్పోతాయి. ఈ ఆకును ఎక్కువగా తాకితే చర్మ రోగాలు వస్తాయి. సాధారణంగా పశువులు ఈ ఆకులు ముట్టవు. కానీ ఎపుడైనా పశుగ్రాసంలో కలిసిపోయి తింటే పశువులు స్పృహ కోల్పోయి, ప్రాణాలమీదకు వస్తుంది. వీటి పువ్వుల్లో ఉండే చిన్న చిన్న విత్తనాలు మూడు కిలోమీటర్ల వరకూ ఎగిరి, మొక్కలు మొలుస్తాయి.
ఏడాకుల చెట్టు..
మనుషులకి చికాకు పుట్టించే మరో చెట్టు ఏడాకుల చెట్టు. దీన్ని దెయ్యం చెట్టని కూడా అంటారు. చెట్టు కొమ్మలకి ఏడాకుల గుచ్ఛంలా అందంగా ఉంటాయి. ఇది చాలా వేగంగా వంద అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. అక్టోబర్ మాసం నుంచి పూతకు వస్తుంది. వాటి వాసనకు కళ్లు తిరుగుతాయి. అదేపనిగా ఈ పూల వాసన పీలిస్తే వాంతులూ అవుతాయి. పూల పుప్పొళ్ళు గాలిలో కలిసి శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. ఇవి కళ్ళల్లో పడితే కంటిచూపు కూడా పోతుంది. పశువులకూ ఇవి ఇబ్బంది. అయితే వీటిని పార్కులు, డివైడర్లు, రోడ్ల పక్కన విరివిగా నాటుతున్నారు. దుష్పరిణామాల నేపథ్యంలో వాటిని ఇటీవల తొలగిస్తున్నారు.
జిల్లేడు..
గుబురుగా పొదలా పెరిగే జిల్లేడు మొక్క నిలువెల్లా విషమే. ఆకులు దళసరిగా పెళుసుగా ఉంటాయి. ఆకులు, కాండాన్ని గిల్లితే పాలు కారతాయి. అవీ విషమే. వీటిలో తెలుపు, లేత నీలం రకాలున్నాయి. తెలుపు అరుదుగా ఉంటుంది. వీటిని పూజకు, పత్రిగాను వాడతారు. పరిసరాల్లో లేతనీలం జిల్లేడు మొక్కలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. పది అడుగుల ఎత్తు వరకూ పెరిగే వీటిని విష ప్రభావంతో పశువులు కూడా తినవు. దీని శాస్త్రీయ నామం కలోట్రోపిక్స్.
తూటి కాడ..
ఇది కూడా పొదలా పెరుగుతుంది. వీటి ఆకులు తమలపాకుల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. అవి సన్నని కాడలకు గుజ్జుగా వస్తాయి. ఇది ఐదారడుగుల వరకూ పెరిగి, లేత నీలిరంగులో అందంగా ఉండే పువ్వులు పూస్తుంది. ఐపోమియా జాతికి చెందిన తూటి ఆకులు పూర్తిగా విషం. వీటిలో లైసర్జిక్ ఆమ్లం ఉంటుంది. పల్లెల్లో వీటిని దడుల్లా ఉపయోగిస్తారు. ఖాళీస్థలాల్లో ఇవి పిచ్చి మొక్కలా పెరిగిపోతాయి. వీటి ఆకులు తింటే వాంతులు, నోట్లో నుంచి నురుగు రావడం, అలర్జీ, టీబీ, పారుడు వంటి సమస్యలు వస్తాయి. పశువులు వీటిని అస్సలు ముట్టవు. చెరువులు, నీటి ఊటల్లోనూ తూటి కాడ ఉంటుంది. దీని విష ప్రభావం మిగతా వాటితో పోల్చితే కాస్త తక్కువే.
ఉమ్మెత్త..
పరిసరాల్లో విపరీతంగా ఉండే ఉమ్మెత్తను 'దత్తురా' అని కూడా పిలుస్తారు. ఆకులు వంగ మొక్క ఆకుల్లా ఉండి, బంతిలాంటి కాయలు నిండుగా ముళ్ళతో ఉంటాయి. ఇవి నీలం లేదా తెలుపు రంగు పువ్వులు పూస్తాయి. పూర్వం వీటి ఆకురసాన్ని బొగ్గుతో కలిపి బాగా రాయడానికి బ్లాక్ బోర్డులకు, పలకలకి పూసేవారు. ఈ మొక్క అన్ని భాగాల్లోనూ విషం ఉంటుంది. అట్రోఫిన్ ఆల్కలాయిడ్స్, కార్డియాక్ గ్లైకోసైట్స్ ఇందులో ఉంటాయి. వీటివలన పొట్టలో కదలికలు స్పందించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శరీర ఉష్టోగ్రతలు తగ్గిపోవడం, దృష్టి మందగించడం, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు సంభవిస్తాయి.
ఆముదం మొక్క..
'ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం' అనేది తెలుగు నానుడి. ఆముదం మొక్క ఔషధాల ఘని అని మనకు తెలుసు. దాని గింజలు నేరుగా తింటే మహా విషం. ఆముదం మొక్కకు చుట్టూతా అరచెయ్యి చాచినట్లుగా ఆకులు విస్తరించి ఉంటాయి. చిన్న చిన్న గుత్తులు మాదిరిగా కాయలు ఉంటాయి. వాటి మీద ముళ్ళు వంటి నూగు ఉంటుంది. వాటిలో గింజలులాంటి విత్తులు ఉంటాయి. వాటితో కాస్టిరాయిల్ తయారుచేస్తారు. వీటిలో మూడు రకాలున్నాయి. వీటి గింజల్లో లాక్టిన్, హిమోగ్లుటినిన్స్ అనే విష రసాయనాలుంటాయి. గింజల పిప్పి ఆరగిస్తే మనుషులు, జంతువులు, కీటకాలకి అరుగుదల తగ్గుతుంది. పారుడు రోగం వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కాళ్ళు తన్నుకుంటూ క్రమంగా స్పృహ పోతుంది. ఒక్కోసారి ప్రాణహాని జరుగుతుంది. 15 అడుగులు ఎత్తువరకూ పెరిగే వీటిని రిసిన్స్, కాస్టర్ బీన్స్ అని కూడా పిలుస్తారు.
గన్నేరు..
గన్నేరు కాయలు, పప్పు విష ప్రభావమని మనం వినే వుంటాం. ఈ చెట్టు సన్నని దళసరి ఆకులతో పొదగా ఉంటుంది. ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబానికి చెందినది. దీనిని రోస్బే అని కూడా అంటారు. దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషం వల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్‌గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. చర్మ వ్యాధులను, కంటి మంట, దురదలు, చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది. నేరియం ఒలీయాండర్ దీని శాస్త్రీయనామం. ఈ జాతి మొక్కల్లో 100 రకాల వరకూ ఉన్నాయి. ఈ మొక్కలు విషతుల్యాలు పొదిగి ఉన్నప్పటికీ వైద్యంలో ఉపయోగపడుతున్నాయి. పరిసరాల్లో ఉండే వీటిపట్ల అవగాహనతో మెలుగుతూ మనం అప్రమత్తంగా ఉండాలి.
చిలుకూరి శ్రీనివాసరావు
8985945506