Oct 12,2023 21:06

వామ్మో ..వైరల్‌..!

జిల్లాను వైరల్‌ ఫీవర్‌ వణికిస్తోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ బాధితుల సంఖ్యా పెరుగుతోంది. వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన వర్షాలు, అధ్వాన పారిశుధ్యం నేపథ్యంలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. డిఎంహెచ్‌ఒ, మున్సిపల్‌, ఆర్‌డబ్య్లుఎస్‌, పారిశుధ్య శాఖల ప్రణాళికా లోపం వల్లే ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతోందనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. సదరు శాఖల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా స్వల్ప వ్యవధిలోనే వేలాది మంది జ్వరాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా వైరల్‌ జ్వరాల బారిన పడింది. ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 22,639 మంది జ్వరాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున జ్వరాల కేసులు నమోదు కావడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది. ఈ లెక్కన మండలానికి వందలాది మందికిపైగా జ్వరాల బారిన పడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన అధికారిక జ్వరాలను మినహాయిస్తే ప్రయివేటు ఆస్పత్రులకు చేరిన కేసుల సంఖ్య ఇంతకు రెట్టింపు ఉండే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీ, ఆర్‌డబ్య్లుఎస్‌, పారిశుధ్య శాఖలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉరుముతోంది.
జిజిహెచ్‌లో పడకలు ఫుల్‌!
జిజిహెచ్‌లో ఒపి, ఐపి పేషంట్ల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంది. 750 పడకలు కలిగిన ఐపిలో ఎన్నడూ లేని విధంగా 740 పడకలు నిండిపోయాయి. ఒపి పేషం ట్లను పరిశీలిస్తే సాధారణంగా 1235 నుంచి ఎన్నడూ లేని విధంగా 1600 మంది వైద్యసేవల నిమిత్తం హాజరు కావడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడిన రోగులు ఉన్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి సుమారు 123 డెంగీ కేసులు నమోదు కాగా నేటికి 263 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఐదేళ్ల కిందట జిల్లాను డెంగీ కేసులు చుట్టుముట్టడంతో తిరుపతి, కర్నూలు, చెన్నరు పట్టణాల్లోని ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు జ్వర పీడితులు పరుగులు తీసిన సంగతి తెలిసిందే.
జ్వర పీడితులతో కిటకిట
ఒంటిమిట్ట నుంచి కొండాపురం మండలాల వరకు జ్వర పీడితులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులనే తేడా లేకుండా జ్వరపీడితులతో కిటకిట లాడుతున్నాయి. జ్వరాల బారిన పడిన వారికి వారం రోజుల వరకు నీరసం వంటి సమస్యలతో సత మతమవుతున్నారు. ఇంటికి ఒకరు చొప్పున వైరల్‌ జ్వరాల బారిన పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని పలు పేద, సామాన్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి..
ప్రయివేటుకు పరుగులు
జిల్లాలోని పిహెచ్‌సిలు, సిహెచ్‌సి ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యంపై భరోసా లేకపోవడంతో ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇంటికి ఒకరు, ఇద్దరు సుమారు రూ.10 వేలు వెచ్చించి వైద్యసేవలు పొందుతున్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ పారిశుధ్యశాఖ, ఆర్‌డబ్య్లుఎస్‌, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 22,639 వైరల్‌, 263 డెంగీ, ఎనిమిది మలేరియా, 142 టైఫాయిడ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
జ్వర పీడితుల డేటా లేదు
జ్వరాల డేటా లేదు. జగనన్న సురక్ష కార్యక్రమంతో పాటు జ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. జ్వరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం.
- నాగరాజు, డిఎంహెచ్‌ఒ, కడప.