ప్రజాశక్తి- పలమనేరు
పాల డెయిరీలు, టింబర్స్ సామిల్లులోని చెట్ల దుంగలు, శతాబ్దాల కాలం నాటి చెట్లను తెగనరికి నిర్భయంగా ప్రధాన రహదారుల గుండా అక్రమార్కులు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చెక్‌పోస్టుల వద్ద అధికారులు, అటవీశాఖ, రెవెన్యూ అధికారులు నిద్రావస్థలో ఉన్నారంటూ పట్టణ ప్రజల నుంచి విమర్శిలు వెల్లువెత్తుతున్నాయి. చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ యథేచ్ఛగా అక్రమంగా కలపను తరలిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అటవీ చెక్‌పోస్టు అక్రమ రవాణాను పెంచిపోషిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా కలపను రవాణా చేయడాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం చెబుతుంటే అటవీశాఖ అధికారులు మాత్రం స్మగ్లర్ల ఆటను మరింత ప్రోత్సహిస్తున్నట్లు ఉంది వారి విధి నిర్వహణ. ప్రభుత్వం చెట్లను యథేచ్ఛగా నరికి రవాణా చేయడాన్ని కట్టడి చేయడానికి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వం ఉదేశ్యం నీరుగారిపోతుంది. చెక్‌పోస్టుల దాటి అక్రమంగా కలప రవాణా జరుగుతూనే ఉంది అయినా పట్టించుకునే నాథుడే లేడని అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేలకూలుతున్న భారీ వృక్షాలు..
అక్రమార్కుల సొంత లాభార్జనకు భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి. శతాబ్దాళ కాలం నాటి అతి పెద్ద చెట్లను సైతం అక్రమార్కులు దుంగలు నరికి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఇది గమనించిన కొందరు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా వారు ఆలస్యంగా వచ్చి చెట్లను లెక్కించి ట్రాక్టర్ లోడ్డుకు రూ.7,400లు కట్టించుకుని రసీదు ఇచ్చి విడిచిపెడుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఇలా అక్రమంగా కలపను తరలిస్తున్న ప్రతిసారి అటవీశాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడంతో అక్రమార్కులు రెచ్చిపోతూ దొరికినంత దోచుకుంటున్నారు. మామూళ్ల తీసుకుంటూ వారిని విడిచిపెట్టేస్తున్నారని కూడా ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు.
చెట్లకు రక్షణ ఏదీ..
భారీగా చెట్లను నరికి వేయడం వలన చెట్ల పరిరక్షణ కరువైంది. దీని వలన పచ్చదనం, ప్రాణవాయువు తగ్గిపోతుంది, కాలుష్యం పెరిగి వాతావరణం సమతుల్యం దెబ్బతింటుంది. పలమనేరు పరిసరాల్లో అటవీ ప్రాంతం ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉంది. చెట్లను విపరీతంగా నరికి తరలించడం వలన అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇక్కడ ఉంటున్న అడవి జంతువులు ఇంకా ఎక్కువగా పల్లెలు, పట్టణాల్లోకి వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుత కాలంలోనే ఏనుగులు, పులులు, ఇతర అడవి జంతువులు ప్రధాన రహదారులు, గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏనుగులు తరచూ వచ్చి పంట పొలాలను నాశనం చేయడంతోపాటు ఇటీవల చిరుతలు రోడ్డుపైకి రావడం గమనిస్తున్నాం. కాస్తూకూస్తో అడవి విస్తీర్ణం ఉండగానే జంతువుల ఇలా వస్తుంటే ఇక అడవులను పూర్తిగా నిర్వీర్యం అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మరి.
వాల్టా చట్టం రెవెన్యూ చేతిలో ఉల్టా
ప్రభుత్వ స్థలాల్లో ఏపుగా పెరిగిన చెట్లను అక్రమార్కులు నరికి సొమ్ము చేసుకుంటున్నా ఆయా ఏరియాలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. వక్ష సంపద రోజురోజుకు తరిగిపోతుంది. వనసంరక్షణ ద్యేయం, నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ఉపయోగించే ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వ, అటవీ బీడు భూముల్లో మొక్కలునాటినా, ఇందుకోసం ప్రభుత్వ ధనం కోట్ల రూపాయలు ఏటా వెచ్చించినప్పటికీ ప్రయోజనం శూన్యమే అవుతోంది. ప్రకృతిని, వృక్ష సంపదను కాపాడటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన వాల్టా చట్టం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన పలమనేరులో ఉల్టా అవుతోంది.
అటవీ శాఖలో అక్రమాలు
ఇదే అదునుగా భావించిన అటవీశాఖ అధికారులు కొంతమంది అక్రమార్కులకు అండగా నిలుస్తూ జేబులు నింపుకునే పనిలో పడ్డారనే విమర్శలున్నాయి. అక్రమ కలప రవాణాను అదాయ వనరుగా మల్చుకుని దొరికినంత దోచుకుంటున్నారు. ఇక చెక్‌పోస్ట్‌లు ఉన్నా నామమాత్రంగానేనని అటవీ శాఖాధికారులను ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రధానంగా చింత, వేప కానుక, మద్ది, వివిధ రకాల నీడనిచ్చే భారీ చెట్లను, ఫలాలు అందించే చింత కానుగ, వేప చెట్లను తెగనరికి తరలించేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించే చెట్లను నరికించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న వారికి మొక్కుబడిగానే జరిమానాల పేరుతో ఫారెస్టు అధికారులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలున్నాయి.
స్పందించని ఉన్నత అధికారులు
పలమనేరు పట్టణం, రూరల్ గంగవరం, వీకోట, కస్తూరి నగరం ప్రదేశాల్లో చెక్‌పోస్టులలో అక్రమంగా కలపను రవాణా చేస్తున్నా, అడవులు హరిస్తున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహించడం దారుణం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తును వీడి, వక్ష సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










