Jul 18,2021 12:24

అతను
ఆశగా అటే నడుస్తాడు
కష్టాన్ని వొంపి
పంటై నిలుస్తాడు
ప్రతిఫలం ఏ దళారో
అతడి బ్రతుకును రాస్తాడు

బ్రతుకు బాటలో
నడవడం తేలికే
పంటను కంటిలో
ప్రమిదలా దాచాక
ఎన్ని వడగాల్పులో
మరిన్ని గ్రహపాటులో ?

ఆదిలోనే
కల్తీ విత్తనం
కసిగా మోసగిస్తుంది
కాస్తో కూస్తో నిలిచే పంటకు
ఎరువు, మందు ధరలు
ముచ్చెమటలు పట్టిస్తాయి
కోత నుండీ,
కుప్ప నూర్పిడి వరకూ
కూలీ ధరలు
కన్నీటిని తెప్పిస్తాయి

చాంతాడంత
ఖర్చులు కంగారెత్తించినా
పంట కోసం చిందించిన శ్రమ
వృథా అయినా
కర్షకుడి మది
ఏనాడూ చినబోదు
కలల పంటల కోసం
మళ్ళీ, మళ్ళీ చిగురు కొమ్మై
చిగురిస్తూనే ఉంటాడు
వాలని పొద్దులా
నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు..!!

మహబూబ్‌ బాషా చిల్లెం
95020 00415