Aug 30,2023 00:43

ప్రజాశక్తి - వినుకొండ : సచివాలయ ఉద్యోగులు, వాలంటరీలు ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేయని వారికి మెమోలు ఇవ్వాలని వార్డు కౌన్సిలర్లు కోరారు. మునిసిపల్‌ సాధారణ సమావేశం చైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరి అధ్యక్షతన మంగళవారం నిర్వహించగా ఎజెండాలోని 31 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ బ్రహ్మయ్య, 19వ వార్డు కౌన్సిలర్‌ భాష, గంటా కాలేషా తదితర కౌన్సిలర్లు మాట్లాడుతూ 12 సచివాలయాల్లో ఉద్యోగులు పనితీరు బాగోలేదని, ప్రజా ప్రతినిధులు చెప్పినా పెడచెవిన పెడుతున్నారని అన్నారు. కమిషనర్‌ వెంకయ్య మాట్లాడుతూ నెలకోసారి పెన్షన్‌ ఇవ్వడం మినహా వాలంటీర్లు ఏమీ చేయడం లేదన్నారు. సచివాలయాల నిర్వహణపై నోడల్‌ ఆఫీసర్లను నియమించామని, ఇక పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్‌ శాఖ అధికారులు పనితీరు పట్ల చైర్మన్‌ అసంతప్తి వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం వద్ద తానే ఆందోళన చేస్తానని చెప్పారు. తాగునీటి కలుసితమపై చర్యలు తీసుకుంటున్నామని, ఎఐఐసి పథకం ద్వారా చేపడుతున్న పైపులైన్‌ నిర్మాణం పనులు నిలిచిపోయాయని ఇప్పటివరకు చేపట్టిన పైపులైను అందుబాటులోకి తెస్తా మని చెప్పారు. జగనన్న కాలనీల్లో రెండో విడదల ఇళ్ల నిర్మా ణానికి అనుమతివ్వాలని 20వ వార్డు కౌన్సిలర్‌ గౌస్‌ బాషా కోరగా అనుమతులు రావాల్సి ఉందని కమిషనర్‌ తెలిపారు.