Mar 13,2023 01:20
అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న మోపిదేవి

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గ్రామ వాలంటీర్లు, నూతనంగా నియమితులైన గృహ సారథులు, గ్రామ కన్వీనర్లు, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. నూతనంగా నియమించబడిన గృహ సారథుల అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం చెరుకుపల్లిలో నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గృహసారథులు తమకు కేటాయించిన, ప్రతి గృహానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలని, తద్వారా రాబోయే ఎన్నికలలో మనకు లాభం చేకూరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గృహసారథులు కేటాయించిన ప్రతి గృహాన్ని సంద ర్శించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, గత ప్రభుత్వానికి ప్రస్తుత మన ప్రభుత్వానికి గల తేడా వివరించాలని, పార్టీతో సంబంధం లేకుండా ప్రస్తుత ప్రభుత్వంలో కేటా యించిన పథకాల వలన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, తద్వారా మన ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో మండల పరిషత్‌ అధ్యక్షులు మత్తి దివాకర్‌ రత్న ప్రసాద్‌, చీరాల ప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పయనం ఏడుకొండలరెడ్డి, ఆరుంబాక గ్రామ సర్పంచ్‌ కామినేని కోటేశ్వర రావు, చెన్ను కోటేశ్వరరావు, రావూరి శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు.