Dec 30,2022 23:48

మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు
ప్రజాశక్తి-కె.కోటపాడు

గ్రామ వాలంటీర్లు చిత్తశుద్ధి, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆదేశించారు. ఇటీవల నియమితులైన వైసిపి సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు, పార్టీకి మరింత మేలు జరిగే రీతిలో హోదాలు మరిచి కుటుంబ సభ్యుల్లా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి వాలంటీరు తమ పరిధిలోని 50 కుటుంబాలను ఆప్యాయంగా పలకరించాలన్నారు. పార్టీ తరఫున కొత్తగా నియమితులైన కన్వీనర్లు త్వరలో నియమితులు కానున్న గృహ సారధులు అంతా వాలంటీర్లతో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. పింఛన్లు తీసుకుంటున్న వారిలో అభ్యంతరాలు ఉన్న కొంత మందికి నోటీసులు ఇచ్చామని, ఈ పింఛన్లు తొలగిస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితవుపలికారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే తప్ప మిగతా వారి పింఛన్లు తొలగించేది లేదని వారికి అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, జడ్పిటిసి ఈర్లే అనురాధ, పంచాయతీ కార్యదర్శులు, వైసిపి సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.