ప్రజాశక్తి- చీడికాడ:వాలంటీర్లు బాధ్యతా యుతంగా పని చేసి ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. చీడికాడ తులసి కళ్యాణ మండపంలో మండలానికి చెందిన వాలంటీర్లతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మాట్లాడుతూ. పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాల అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. గ్రామాల్లోనే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయం వ్యవస్థను వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో టిడిపి పని అయిపోయిందని, గ్రామాల్లో ఏమి చెప్పలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉందన్నారు. గ్రామాల్లో టిడిపి ఇదేం కర్మ కార్యక్రమం ఎందుకు చేస్తుందో అర్థం కాలేదన్నారు. గత టిడిపి ప్రభుత్వం జన్మభూమి కమిటీలు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. నియోజవర్గంలో ముగ్గురు టిడిపి నాయకులు సీటు కోసం తిరుగుతున్నారని, వారిలో ఎవరికి సీటు ఇచ్చినా మళ్లీ వైసిపి విజయం ఖాయమని జోస్యం చెప్పారు. గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి, జడ్పిటిసి లాలం శారద వరలక్ష్మి జానకిరామ్, వైస్ ఎంపీపీలు స్వాతి కొండబాబు, చినమ్మలు, ఎంపీడీవో జయప్రకాశరావు, తహసిల్దార్ బివి రాణి, మండల వైసీపీ కన్వీనర్ గొల్లవిల్లి రాజుబాబు, యూత్ కన్వీనర్ స్వామి నాయుడు, వైసిపి నాయకులు ఎర్ర అప్పారావు, సుంకరి శ్రీనివాసరావు, పరువాడ రామారావు, అప్పారావు, రామకృష్ణ వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.










