ప్రజాశక్తి-సంతమాగులూరు: ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేర్చే సంక్షేమ సారథులు వాలంటీర్లేనని రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. శనివారం మండల ప్రజా పరిషత్ సమావేశం హాలులో, ఎంపీడీవో సిహెచ్ కృష్ణ అధ్యక్షతన జరిగిన గ్రామ వాలంటీర్ల సేవలకు, సేవా రత్న, సేవా మిత్ర పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఐదుగురు వాలంటీర్లకు సేవారత్న, 263 మంది వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులను అందజేశారు. అనంతరం చైతన్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లు రెండు కళ్ళు లాంటి వారన్నారు.
జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు వాలంటీర్లు కీలకమన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని మమ్ము చేయవద్దని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వాలంటీర్ల పనితీరు మెరుగుపరుచు కోవాలన్నారు. పనిచేయని వాలంటీర్లను రిమూవ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, తహశీల్దారు అశోకవర్ధన్, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు, నాయకులు బొల్లినేని రామకృష్ణ, నాగబోతు రామాంజనేయులు, దుద్దేల గాలెయ్య, ముసలారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.










