- రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రజాశక్తి - వజ్రపుకొత్తూరు: సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను కించపరిచే వారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని కొత్తపేటలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దు పొడవక ముందే మీ ఇంటి తలుపులు తట్టి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, దీన్ని ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మండల కేంద్రాల్లోని కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉన్న ఊరిలోనే అన్ని సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి అండగా నిలిచి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్‌పర్సన్ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, ఎంపిపి ప్రతినిధి ఉప్పరవల్లి ఉదరు కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ అంబటి శ్రీను, ఎంపిటిసి సభ్యులు బాలక శ్రీను, క్లస్టర్ ఇన్‌ఛార్జి దున్న బాలరాజు, మద్దిలి హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.










