Jul 10,2023 22:34

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
        వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వైసిపి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజియన్‌ ఛైర్మన్‌ వందనపు సాయి బాల పద్మ అన్నారు. సోమవారం ఆమె వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్‌ ఏలూరు పర్యటనలో ప్రభుత్వంపై చేసిన నిరాధా రమైన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మహిళల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహి స్తుందన్నారు. చంద్రబాబుకు ఆటబొమ్మగా మారిన పవన్‌కల్యాణ్‌ నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం తగదన్నారు. దమ్ముంటే ఆధా రాలతో నిరూపించాలని సవాల్‌ విసిరారు. సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడంలో కీలకపాత్ర వహిస్తున్న వాలంటీర్లను చులకన చేసి మాట్లాడటం నీచమని మండిపడ్డారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు సరికావని చింతలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. మండలంలోని లక్కవరంలో నిర్వహించిన జగనన్న సురక్షలో ఎలిజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ తన చేతిలో మైక్‌ ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఆధారాలతో నిరూపించాలని సవాల్‌ విసిరారు. కేంద్ర నిఘవర్గాలు పవన్‌ ఒక్కడికే చెబుతాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడటం తప్ప మరొకటి తెలియదన్నారు.
చింతలపూడి : ఏలూరు బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్ల అనుచిత వ్యాఖ్యలు సరికావని ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా అన్నారు. కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పేర్కొనడం కూడా సరికాదన్నారు. నిఘా వర్గాలు చెబితే ముఖ్యమంత్రికి చెబుతాయి తప్ప పవన్‌కు ఎందుకు చెబుతాయని ప్రశ్నించారు. అనంతరం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌లో పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నూజివీడు రూరల్‌:జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నూజివీడు పంట్టణంలోని చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌లో వాలంటీర్లు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ పగడాల సత్యనారాయణ, వైసిపి పట్టణ అధ్యక్షులు రాము, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
ముసునూరు:పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సరికావని, బాధాకరమని ఆయన తక్షణం వాలంటీర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వాలంటీర్ల మండల కన్వీనర్‌, జెడ్‌పిటిసి సభ్యులు వరికూటి ప్రతాప్‌, వైసిపి మండల నాయకులు కంభాల దాసు విమర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఒ కార్యాలయం నుండి పోలీస్‌ స్టేషన్‌ వరకూ వాలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసిపి నాయకులు తుల్లిమెల్లి రంగారావు పాల్గొన్నారు.
పోలవరం : వాలంటీర్లపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ఖండించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వారు అని, అలాంటి వారి పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పవన్‌కు తగదన్నారు. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన పవన్‌ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.