- సబ్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి
ప్రజాశక్తి- టెక్కలి : బూత్‌స్థాయిలోని ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం రెెవెన్యూ అధికారులు, బిఎల్‌ఒలతో చేపడుతున్న సర్వేలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదని, వారి జోక్యం చేసుకున్నట్లు రుజువు అయితే వారిని విధుల నుంచి తొలగిస్తామని సబ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం డివిజన్‌స్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం నుంచి చేపట్టనున్న సర్వేలో భాగంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఒక కుటుంబానికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సర్వే సమాచారాన్ని మైక్‌లో ప్రచారం చేపట్టేవిధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తామని అన్నారు. ఓటర్లకు పోలింగ్‌స్టేషన్ వినియోగంపై ఆవగాహన కల్పించాల్సిన ఆవసరం ఉందన్నారు. ఒక పేరు రెండు మూడు చోట్ల ఉంటే నిబంధనల ప్రకారం రద్దు చేయాలన్నారు. ప్రతి మంగళవారమూ ఉదయం ఆన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 24న తహశీల్దార్ కార్యాలయాల వద్ద, గ్రామ సచివాలయాల వద్ద పంచాయతీ కార్యాలయాల వద్ద నివేదిక విడుదల చేస్తామని, ఏమైనా సవరణలు, మార్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. నాయకులు సత్తారు రంగబాబు మాట్లాడుతూ పట్టణంలో చాలా వరకు ఓట్లు గల్లంతు ఆయ్యాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బిజెపి నాయకులు హనుమంతు ఉదరుభాస్కర్ మాట్లాడుతూ కోటబోమ్మాళి మండలం తులసిపేట బూత్‌లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటింగ్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కార్యాలయ సూపరింటెండెంట్ రాజమోహన్, తహశీల్దార్ కురమాన ప్రవళ్లికాప్రియ, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు బగాది శేషగిరి, జీరు భీమారావు, పినకాన అజరుకుమార్, బోయిన రమేష్, వైసిపి నాయకులు ఆట్ల రాహుల్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోత మధుసూదనరావు, సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు పాల్గొన్నారు.










