Nov 13,2023 19:38

ఆస్పరి గ్రామ సచివాలయం

ప్రజాశక్తి - ఆస్పరి
వాలంటీర్ల నిర్లక్ష్యంతో బాధితులకు బీమా అందడం లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వాలంటీరు వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వ పథకాలను పార్టీలకతీతంగా అందించాలని ముఖ్యమంత్రి చెబుతుండగా కొంతమంది వాలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆస్పరిలో వైఎస్‌ఆర్‌ బీమా కొంతమంది అర్హులకు అందని పరిస్థితి నెలకొంది. ఆస్పరి గ్రామంలో శుద్ధ బాయి కాలనీ ముని రాజు (26) మృతి చెందారు. వాలంటీర్లు కుటుంబ యజమానిగా ఉన్న యువకుని పేరు ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ చేయకపోవడంతో వైఎస్‌ఆర్‌ బీమా అందని పరిస్థితి ఏర్పడింది. యువకునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీమాకు ఎన్‌రోల్‌మెంట్‌ చేసి ఉంటే ఆ కుటుంబానికి వైఎస్‌ఆర్‌ బీమా కింద అందే రూ.లక్ష పరిహారం ఉపయోగపడేది. ఇదే కాకుండా చాలా మంది వాలంటీర్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వం అందించే వైఎస్‌ఆర్‌ బీమా పథకం మృతుల కుటుంబాలకు దరిచేరడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ బీమా 60 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు కుదించడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 50 నుంచి 55 ఏళ్ల వరకు బీమా వర్తిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. నవంబర్‌ 8న బాట లింగన్న (53) అనే రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 49 ఏళ్లు పైబడి ఉండడంతో బీమా వర్తించ లేదు. వ్యక్తులు సాధారణ, ప్రమాదాల్లో మృతి చెందితే కుటుంబానికి బీమా వర్తించకపోవడంతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఆస్పరిలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరింత అధ్వానంగా ఉంటుందని మండిపడుతున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే వాలంటీర్లు సక్రమంగా పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.