
ప్రజాశక్తి - సాలూరు : మున్సిపాలిటీలో ఏడు వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎంపికైన వారికి శుక్రవారం చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఏ వార్డులో ఉన్న వాలంటీర్ పోస్టును ఆ వార్డు కౌన్సిలర్ సిఫార్సు మేరకు ఇచ్చేయాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర నిర్ణయించారు. వైసిపి అధికారంలోకి వచ్చి, మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత తమకు తగిన గుర్తింపు లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అమలు లోకి వచ్చిన తర్వాత వార్డు ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూడడంలో గాని, ఇతర అభివృద్ధి పనుల సిఫార్సులో గానీ ప్రాధాన్యత లేకుండా పోయిందనే అభిప్రాయంతో వారున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వార్డులో గల వాలంటీర్ పోస్టును ఆ వార్డు కౌన్సిలర్ సిఫార్సు మేరకు కేటాయించాలని రాజన్నదొర ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పట్టణంలో రెండో వార్డులో ఖాళీ అయిన వాలంటీర్ పోస్టును రాజన్నదొర ఆదేశాల మేరకు ఆ వార్డు కౌన్సిలర్ పప్పుల లక్ష్మణరావు సిఫార్సు చేసిన అభ్యర్ధికి ఇవ్వాలి. కానీ ఆ వాలంటీర్ పోస్టును ఇతర వార్డుకు చెందిన నాయకుల సిఫార్సు చేసిన అభ్యర్ధికి ఇవ్వడంపై కౌన్సిలర్ లక్ష్మణరావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొదట కౌన్సిలర్ లక్ష్మణరావు సిఫార్సు చేసిన అభ్యర్ధిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పేరు మార్చి ఇవ్వాలని రాజన్నదొర కోరారు. దీంతో ఆయన పేరు మార్చి ఇవ్వడానికి ప్రయత్నించగా రాజన్నదొర అమరావతి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ లక్ష్మణరావు చెప్పిన అభ్యర్థికి కాకుండా ఇతర వార్డు నాయకుల సిఫార్సు మేరకు కేటాయించారు. దీంతో కౌన్సిలర్ లక్ష్మణరావు తీవ్ర అసంతప్తి కి లోనై రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ కౌన్సిలర్‌గా ఎన్నికై రెండున్నర ఏళ్ళు దాటినా వార్డులో ఒక్క అభివృద్ధి పని కూడా చేయించుకోలేని దుస్థితిలో ఉన్నానని, ఇలాంటి పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆయన భావిస్తున్నారు. త్వరలో వార్డు పెద్దలు, నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది.