Oct 30,2023 20:34

విగ్రహావిష్కరణలో పాల్గొన్న పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు

ప్రజాశక్తి - మంత్రాలయం
వాల్మీకి మహర్షి ద్వారా శ్రీరాముని గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద నూతనంగా వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం అనే గొప్ప కావ్యం వల్లనే శ్రీరాముడు సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయుడయ్యారని చెప్పారు. వాల్మీకులంతా కలిసి ఇలాంటి గొప్ప కవి వాల్మీకి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. అంతకుముందు రాఘవేంద్ర సర్కిల్‌ చేరుకున్న పీఠాధిపతులకు బాణసంచా పేల్చి, శాలువా, పూలమాలలు వేసి పుష్పాభిషేకంతో ఘనంగా ఆహ్వానించారు. శ్రీమఠం ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యాలయ అధికారి శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి.నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, సిబ్బంది భీమాచార్‌, మురళీ స్వామి ఉన్నారు.
వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణలో ప్రముఖులు
- ఒకరి తర్వాత ఒకరు హాజరయిన పార్టీల నేతలు

వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా టిటిడి బోర్డు సభ్యులు వై.సీతారామిరెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, సర్పంచి భీమయ్య, ఉప సర్పంచి హోటల్‌ పరమేష్‌ స్వామి, ఎంపిటిసి జి.వెంకటేష్‌, మాజీ ఉప సర్పంచి గోర్కల్‌ కృష్ణస్వామి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు కురువ మల్లికార్జున హాజరయ్యారు. విగ్రహావిష్కరణలో భాగంగా టిడిపిలో గ్రూపు విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్‌ స్వామి, అశోక్‌ రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు అమర్‌నాథ్‌ రెడ్డి, మీడియా ఇన్‌ఛార్జీ విజయరామిరెడ్డి, చావిడి వెంకటేష్‌, సూగూరు నాగేష్‌ నాయుడు హాజరయ్యారు. అంతకుముందే టిడిపి సీనియర్‌ నాయకులు ఉలిగయ్య గ్రూపులోని చూడి ఉలిగయ్య, పల్లెపాడు రామిరెడ్డి, కోసిగి ముత్తు రెడ్డి, కెడిసిసి మాజీ ఛైర్మన్‌, మాజీ ఎంపిపి మాధవరం రామిరెడ్డి కుమారులు రాఘవేంద్ర రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాకేష్‌ రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బి.లక్ష్మన్న ఒకేసారి హాజరయ్యారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ సభ్యులు గుడిసె కృష్ణమ్మ ఒంటరిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు డిసి.తిమ్మప్ప, దుళ్లయ్య, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఖాసీం, వీరేష్‌, మేకల నరసింహ అతిథులను బాణసంచా పేల్చుతూ శాలువా, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర మాట్లాడారు. వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాంపురం రెడ్డి సోదరుల సహకారం మరువలేదని తెలిపారు. అంతకుముందు వాల్మీకి కుటుంబానికి చెందిన మహిళలు కళాశాలతో ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా వచ్చి వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

విగ్రహావిష్కరణలో పాల్గొన్న తిక్కారెడ్డి, నాయకులు
విగ్రహావిష్కరణలో పాల్గొన్న తిక్కారెడ్డి, నాయకులు