Feb 21,2021 12:23

'నాన్నా! ఏంటీ ఇలా నడచుకుంటూ బజారులో ఆ బరువు మొయ్యడం? ఇలా రండి ఇక్కడ కూర్చోండి!' అంటూ చేతిలో సంచి అందుకొని, పక్కనే ఉన్న షాప్‌ దగ్గర బెంచ్‌ మీద కూర్చోపెట్టాడు.
భుజం చుట్టూ చేయివేసి, ఆత్మీయంగా మాట్లాడుతున్న అతనితో 'నేను నీకు ఎలా తెలుసుబాబు?' అని మాధవరావు అడిగాడు.
ఆ మాటలకి నవ్వుతూ 'పిచ్చినాన్నా! కొడుకుకి తండ్రి తెలియటం ఏంటి? ఏదో వాకింగ్‌కి వెళ్ళడం ఫర్వాలేదు. కానీ ఇలా సంచులు మోసుకుంటూ నడవటం అదీ చెయ్యకండి. అవునూ అమ్మ ఏది? ఓహో ఆ గాజుల షాపు దగ్గర ఉందా! మీరిక్కడే ఉండండి, అమ్మని తీసుకొని వస్తాను' అంటూ మందలిస్తున్న తీరు, పట్టుకున్న స్పర్శ మాధవరావుకి ఆనందంగా అనిపించింది. కానీ దాని వెంటనే ఆ మొహంలో బాధ కూడా చోటు చేసుకుంది.
***
గాజుల షాపు దగ్గర నుంచుని అదేపనిగా వాటినే చూస్తున్న శారద చెయ్యి పట్టుకొని 'అమ్మా! నాకూ కొంటావా గాజులు? మా ఫ్రెండ్స్‌ అందరికీ చూపిస్తాను జైపూర్‌ గాజులు!' అని అంటున్న స్వరం వినిపించి.. ఒక్కసారి ఉలిక్కిపడి, పక్కకు చూసింది. ఒక పాతికేళ్ళ యువతి మోడ్రన్‌ బట్టల్లో ఉంది. క్షణంలో తెప్పరిల్లి ప్రశ్నార్థకంగా ఆ యువతి వైపు చూసింది శారద. 'అదేంటి అమ్మా చెప్పకుండా వచ్చేశావు? నేను పిలుస్తూనే ఉన్నా.. ఆగమ్మా, నేను వస్తున్నాను అంటున్నా నువ్వు వినిపించుకోలేదు!' అని గబగబా మాట్లాడేస్తోంది.
తనకి మాట్లాడే సమయం ఇవ్వకుండా అలా మాట్లాడేస్తున్న ఆ అమ్మాయిని విస్తుపోతూ చూస్తోంది శారద.
ఎప్పుడూ చూసిన జ్ఞాపకం కూడా లేదు అనుకొని, అదే మాటను పైకనేసింది.
ఆ మాటలకి ఆ అమ్మాయి చిన్నబుచ్చుకొని 'అదేంటమ్మా! ఎంత నీ మాట కాదన్నా, మరీ ఇంత కోపమా? మీరు చూసిన సంబంధం నాకు నచ్చలేదు. కానీ నేను నా కొలీగ్‌ జాన్‌ని ప్రేమించాను. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. అందుకు ఇంత కోపమా? అంటూ శారదని పొదవి పట్టుకొని, అతని దగ్గరగా తీసుకొని వెళుతోంది.
జాన్‌ చేతిలో ఉన్న బాగ్‌ కింద పెట్టి, ముందుకి వంగి కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇద్దరూ కలిసి ఆమెని నడిపించుకుంటూ వస్తున్నారు.
శారద మటుకు ఇంకా విభ్రాంతి నుంచి తేరుకోలేదు. పైగా అంతా అయోమయంగా ఉంది.
కొంచెం ముందుకు నడిచేసరికి అక్కడ బెంచ్‌ మీద మాధవరావు కూర్చొని ఉన్నాడు. ఆమెని చూస్తూనే 'ఇప్పుడో గమ్మత్తు జరిగింది' అంటూ చెప్పాడు. అంతా వినీ వెంటనే 'అవునండీ ఆశ్చర్యంగానే ఉంది' అంటూ తనకు జరిగిన అనుభవం గురించీ చెప్పింది.
అలా ఇద్దరూ ఒకటికి రెండుసార్లు జరిగిన విషయాలన్నీ ఆనందంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు పదకొండేళ్ళ క్రితం జరిగిన ఆ భయంకరమైన సంఘటన తాలూకు జ్ఞాపకాలు ఇద్దరికీ గుర్తుకొచ్చాయి.
***
కళ్ళు తెరిచేసరికి, పక్కనే ఉన్న నర్సు హిందీలో 'ఎలా ఉన్నావు?' అని అడిగింది.
'బాగానే ఉన్నాను. అసలు ఏమయింది? నేను హాస్పిటల్‌కి ఎలా వచ్చాను?' అని చుట్టూ చూస్తూ అడిగాడు మాధవరావు. ఏ పక్కకి చూసినా నర్సులు, డాక్టర్స్‌ హడావుడిగా పరిగెడుతున్నారు. మాటలు, ఏడుపులు కలగాపులగంగా వినపడుతున్నాయి.
'కంగారుపడకు, నెమ్మదిగా లేచి కూర్చో!' అంది. కుడికాలు పిక్కకి కట్టుకట్టి ఉంది. ఒక చెంప మీద, నుదుటి మీద బాండేజీలు వేసి ఉన్నాయి. 'అయ్యో నా పిల్లలు, భార్య ఎక్కడీ' కంగారుగా అడిగాడు.
ఇంతలో డాక్టర్‌ వచ్చారు. అతనితో పాటు ఓ లిస్టు తీసుకొని కొంతమంది పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు పేర్లు చదువుతున్నప్పుడు ఇతని పేరు, భార్య పేరు వచ్చింది, పిల్లల పేర్లు రాలేదు. 'నీ భార్య ఇంకో వార్డులో ఉంది. ఆమెకి మొహమంతా మేకులు గుచ్చుకొని గాయాలయ్యాయి!' అని చెప్పారు.
'అయ్యో పిల్లలు ఏమయ్యారు?' అని గట్టిగా ఏడ్చాడు.
అప్పుడు అక్కడ ఉన్న నర్సు నెమ్మదిగా అతన్ని చూస్తూ 'నిన్న సాయంత్రం సిటీ మొత్తం బాంబ్‌ బ్లాస్ట్‌లయ్యాయి. అందరికీ బాగా గాయాలయ్యాయి' అందిగానీ వాళ్ళు చనిపోయారని చెప్పలేదు.
కానీ రెండురోజులు తరువాత తెలిసింది. భార్య బతికింది కానీ పిల్లలిద్దరూ చనిపోయారని. వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఆ దురదృష్టకరమైన సాయంత్రం అసలు ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేశాడు.
***
అతను పిల్లలిద్దరికీ అన్నీ చూపిస్తూ విశేషాలు చెబుతున్నాడు. రెండేళ్ళకోసారి ఏదో ఒక ప్రదేశాన్ని చూడటానికి వెళుతూ ఉంటారు. ఈ మాటు రాజస్తాన్‌ టూర్‌ పెట్టుకున్నారు. అందులో భాగంగా జైపూర్‌ చూడటానికి వచ్చారు. జైపూర్‌లోని ముఖ్య ప్రదేశాలన్నీ చూశారు. నిండా కోటలు, రాజభవనాలతో నిండి ఉన్న జైపూర్‌లో బోలెడన్ని పోటోలు తీసుకున్నారు.
'ఇక సాయంత్రం ట్రీపోలియా బజార్‌కి వెళ్లి, అక్కడే డిన్నర్‌ చేద్దాము. ఎన్నో రకాల వెరైటీలు ఉంటాయి' అని తనకు తెలిసిన పేర్లు చెప్పింది ఆమె. 'అంతేకాదు అక్కడ ఎవరికైనా గిఫ్ట్‌ ఐటమ్స్‌ గాజులు, ఇంకా చాలా దొరకుతాయి.. అవి కొనాలి. అన్నట్లు ఏమండోయి శ్రీవారు నాకు జైపూర్‌ చీర మీరే కొనిపెట్టాలి!' అనగానే.. 'అన్నావా ఇంకా చీర ప్రసక్తి రాలేదేమిటా? అనుకున్నాను'.
'అమ్మా! మా ఫ్రెండ్‌ చెప్పాడు. ఏదో లడ్డు. మూంగ్‌దాల్‌ హల్వా!'
'అలాగే నాన్నా! అన్ని కొనుక్కుందాం.'
'ఆ లడ్డూని ''చోగుణి లడ్డూ'' అంటారు' అన్నాడతను.
ఎక్కడ చూసినా అంతా సందడిగా ఉంది. ఇది అత్యంత బిజీగా ఉండే మార్కెట్‌. ఫారెనర్స్‌ కూడా బాగా వస్తారు. ఒక పక్క రాగి, ఇత్తడి సామానులు అమ్మే దుకాణాలు ఉన్నాయి. ఆడవాళ్ళూ ఎంతో ఇష్టపడే జైపూర్‌ చీరలు చాలా ప్రసిద్ధి కూడా. అవన్నీ చూసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ నడుస్తూ 'ఏమండీ ముందు పిల్లలకి ఏవైనా తినిపించేసి, తరువాత కొనుక్కుందాము' అంది.
'అబ్బ ఏం తెలివి? నిజంగా హేట్సాఫ్‌!' అన్నాడు.
అలా నడుసూ ్తముందుకు వెళుతుంటే 'ఆ పక్కకే, సిటీ ప్యాలెస్‌ యొక్క గేట్లలో ఒక గేటు ఉంది. అది రాజవంశ కుటుంబం మాత్రమే ఉపయోగిస్తారట! తీజ్‌ పండగలలో ఇక్కడ ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి' అని పిల్లలకి చెబుతున్నాడు.
సంతోషంగా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా పెద్ద శబ్ధం అయ్యింది. అసలు ఏం జరుగుతోందో తెలిసే లోపల అంతా పొగ కమ్మేసింది. ముక్కులోకి, గొంతులోకి పొగ వెళ్ళడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా 'సైకిల్‌ మే బాంబు లగాయా!'.. అన్న మాటలు లీలగ వినిపించాయి. అంతే ఆ తరువాత కళ్ళ ముందు చీకటి. ఏం జరిగిందో తెలియదు.
***
ఉదయాన్నే డిల్లీ నుంచి జైపూర్‌ బయలుదేరిన లగ్జరీ టూర్‌ బస్సు అందులో దాదాపుగా, చిన్నా పెద్ద కలిపి ఇరవైమంది వరకూ ఉన్నారు. దాదాపుగా అన్నీ చూసుకొని, చివర్లో షాపింగ్‌ కోసం ట్రీ పోలియాబజార్‌ దగ్గర దింపి, గంట టైం ఇచ్చి 'అందరూ తొందరగా వచ్చేయాలి!' అని చెప్పాడు టూర్‌ ఆపరేటర్‌. అరగంట నుంచి షాపింగ్‌ చేసినా తనివి తీరటం లేదు ఆడవారికి, మగవాళ్ళేమో మాటిమాటికి వాచ్‌ చూసుకుంటున్నారు. ఒకటే పనిచేసే రియాజ్‌, మురళీ జైపూర్‌ చూడటానికి ఫామిలీస్‌తో వచ్చారు. అన్నీ చూపించేసి షాపింగ్‌కి కొంతసమయం ఇస్తారు. ఇప్పుడు ఆ హడావుడిలో ఉన్నారు వాళ్ళు. ఆ రోజున తారిఖ్‌కు కాస్త ఒంట్లో బాగోలేదు. అందుకే అతను బస్సు దగ్గరే ఉండిపోయాడు.
మురళీ, జ్యోతి, రియాజ్‌, పర్వీన్‌ పిల్లలు వర్ష, సునీల్‌, షాహిన్‌ అందరూ ఆ బజార్‌లో షాపింగ్‌ చేస్తున్నారు. ఇంతలో వర్షకి అర్జెంటుగా టాయిలెట్‌కి వచ్చి, కాస్త దూరంలో ఉన్న టాయిలెట్స్‌లోకి వెళ్ళింది.
అంతే ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. ఆ తరువాత పొగ. కళ్ళ ముందు చిమ్మచీకటి కమ్మేసింది.
కొంతసేపటికి ఆ ప్రదేశమంతా ఆర్తనాదాలతో దద్ధరిల్లింది. చాలామందికి తీవ్రగాయాలు అయ్యాయి. కొంతమంది శరీర భాగాలు తెగిపడ్డాయి, భయానికంగా ఉంది. పిల్లలను కోల్పోయిన తల్లితండ్రులు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలు. భర్త పోయి ఒకరు, భార్య శరీరం ఎక్కడుందో తెలియని ఓ భర్త. ఇలా అక్కడ తమ వాళ్ళ కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నారు. అన్ని షాపులలో వస్తువులు, చెల్లాచెదురుగా పడిపోయాయి. కొంతసేపటి తర్వాత అంబులెన్స్‌లు వచ్చాయి. దగ్గరగా ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళుతున్నారు. చిన్నపిల్లలని, దెబ్బలు తగిలిన వాళ్ళని ఆత్మీయంగా దగ్గరకి తీసుకొని పలకరిస్తూన్న పోలీసువాళ్ళు. ఇంకా కొంతమంది అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు.
వార్తలలో జైపూర్‌లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయనీ, దాదాపుగా 80 మంది చనిపోయారనీ, చాలామంది గాయపడ్డారనీ చెప్తున్నారు.
ఇది ఉగ్రవాద చర్య అని తెలిసి దేశమంతా అట్టుడికిపోయింది. ప్రపంచ దేశాలు ఈ భయంకరమైన చర్యను ఖండించాయి.
పదహారేళ్ళ అబ్బాయి హాస్పిటల్‌ అంతా కలయ తిరుగుతున్నాడు. వాళ్ళు వచ్చిన బస్సు వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మనాన్న, చెల్లి గురించి అందరినీ అడుగుతున్నాడు. అక్కడ సమాధానం ఇచ్చేవాళ్లే కనిపించటం లేదు. ఎక్కడ చూసినా వాళ్ళవాళ్ళు కనిపించటం లేదని ఏడుస్తూ, ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్న జనం. పోలీసులు లెక్కలేనంత మంది ఉన్నారు.
ఇంతలో హాస్పిటల్‌ ఆవరణలో ఉన్న ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తోంది. 'అరె వర్ష కదా!' అనుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. ఇతన్ని చూడంగానే 'భయ్యా! అమ్మానాన్న, అన్నయ్య కనిపించటం లేదు!' అని చుట్టేసుకొని ఏడుస్తోంది.
రెండురోజులు గడిచాయి. మూడో నాటికీ ఇన్ఫర్మేషన్‌ తెలిసింది. తమతోపాటు బస్సులో వచ్చిన వాళ్లందరూ చనిపోయారు. వాళ్ళిద్దరి దుఃఖానికి అంతే లేదు. అప్పటికే విషయం తెలుసుకున్న తారీఖ్‌ తాతగారు మేజర్‌ కుర్షీద్‌ వెంటనే వచ్చేశారు. ఎన్నో యుద్ధాలను చూసిన ఆయన కూడా ఆ భయంకర సంఘటనను తట్టుకోలేకపోయారు. ఒకేసారి కొడుకు, కోడలు చనిపోవటం పెద్ద విషాదం.
ఆరోజు జరిగిన సంఘటనలో తల్లితండ్రులతో పాటు అన్నయ్య సునీల్‌ కూడా చనిపోయేటప్పటికి భయంతో వర్ష తారిఖ్‌ని వదలలేదు. పైగా వాళ్ళకి ఎక్కువమంది బంధువులు కూడా లేరు. అందుకే మేజర్‌ కుర్షీద్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు. తమతో పాటు ఎటువంటి బంధుత్వం లేకపోయినా వర్షనీ వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. మతపరమైన ఆచార వ్యవహారాలలో అంతరాలు ఉన్నప్పటికీ వాళ్ళు చూపించే ప్రేమకి అవేమీ అడ్డుకాలేదు. మేజర్‌ కుర్షీద్‌ ఈ వయసులో తన దుఃఖాన్ని దిగమింగి, మనవడు తారిఖ్‌తో పాటు వర్షని కూడా జాగ్రత్తగా చూసుకోసాగారు.
గడచిన ఈ పదకొండేళ్ళలో తారిఖ్‌ తాతగారి సంరక్షణలో ఇద్దరూ బాగా చదువుకొన్నారు. వర్ష తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని బంధువులెవరూ ఆమె బాధ్యత తీసుకోలేదు.
హాస్టల్‌లో ఉంటూ సెలవులివ్వగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసేది వర్ష. కాలం ఏ గాయాన్నైనా మాన్పుతుంది అంటారు. కానీ అది నిజంగా సాధ్యపడేదేనా?
కన్నవారిని మరిచిపోవడం జరుగుతుందా? ఎన్నటికీ జరగదు. కాకపోతే బాధ తాలూకు తీవ్రత తగ్గుతుందేమో! అదే వర్తించింది తారిఖ్‌ విషయంలో. ఇంజనీరింగ్‌ ఫస్ట్‌న పాస్‌ అయ్యి, కొన్నాళ్ళు జాబు చేసి, ఇప్పుడు సివిల్స్‌ రాశాడు. రిజల్ట్స్‌ కోసం చూస్తున్నాడు. ఐపిఎస్‌ అవ్వాలని కోరికగా ఉంది.
వర్ష మెడిసిన్‌ చేసి, పిజి పీడియాట్రిక్‌లో చేస్తోంది. తన క్లాస్‌మేట్‌ అయిన జాన్‌ని ప్రేమించి, పెళ్లిచేసుకుంది. ఇద్దరూ భవిష్యత్తులో ఒక హాస్పిటల్‌ పెట్టాలని కోరిక.
అనుకోకుండా ఒకరోజు నిద్రలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి కుర్షీద్‌ చనిపోయారు.
ఉన్న ఒక్క పెద్దదిక్కూ పోవడంతో వాళ్ల పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది పరిస్థితి. ఆయన లేనిలోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇద్దరికీ. ఆ సమయంలో జాన్‌ చొరవ తీసుకొని, ఇద్దరినీ ఓదార్చేవాడు.
ప్రతి ఏడాదిలానే వర్ష, తారీఖ్‌ జైపూర్‌ వచ్చారు. అయితే ఈ మాటు కుర్షీద్‌ లేరు. వాళ్ళతో పాటు జాన్‌ వచ్చాడు.
***
పదకొండేళ్లగా మాధవరావు, శారద వస్తూనే ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగి తమవాళ్ళు కనిపిస్తారనే ఓ ఆశ. నిజానికి అది జరగదని తెలుసు.
***
మనుషుల మధ్య బంధం ఏర్పడటానికి ఓ చిన్న కారణం చాలు.
ఇప్పుడు అదే జరిగింది మాధవరావు, శారద విషయంలో.
వర్ష, తారిఖ్‌, జాన్‌ బజారులో నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్లకు ముందుగా నడుస్తున్న భార్యాభర్తలను చూసి అమ్మానాన్న ఉంటే ఇలానే ఉండేవారు అనుకుంటున్నారు.
మాధవరావు, శారద తమను దాటుకుని వెళ్తున్న తారిఖ్‌, వర్షలను చూస్తూ 'ఈ అబ్బాయిని చూస్తే అచ్చు మన కార్తీక్‌ ఉంటే ఈ పాటికి ఇలాగే ఉండేవాడు కదా అనిపిస్తోంది' అంది శారద.
'అవును ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే అచ్చు మన ప్రశాంతి పెద్దదై ఉంటే, ఇలాగే ఉండేదేమో! ఆ హడావుడి అదీ చూస్తుంటే కళ్ళ ముందు నిలుచున్నట్లుగానే ఉంది!' అన్నాడు మాధవరావు.
'ఏదో ఊళ్లు చూద్దామన్న ఆశతో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపుకున్నాం. మన కడుపులో చిచ్చుపెట్టిన వాళ్ళకి శిక్ష పడిందో, లేదో తెలియదుగానీ నా ఉసురు పోసుకుంటారు అంది శారద.
ఇవన్నీ కాస్త ఎడంగా వాళ్ళ పక్కనే నడుస్తున్న తారిఖ్‌, వర్షాకి విన్పించాయి. వాళ్ళ వైపే చూసుకుంటూ నడుస్తున్నారు.
అక్కడున్న స్వీట్‌షాప్‌లోకి వెళ్లి హల్వా తీసుకొంటుంటే ఆ షాప్‌ ఓనర్‌ అతన్ని గుర్తుపట్టి 'భారుసాబ్‌ వాళ్ళపిల్లలూ ఆ రోజు బ్లాస్ట్‌లో చనిపోయారు!' అని చెప్పాడు. 'వాళ్ళు మీలాగే ప్రతి ఏడాది వస్తారుట!' ''ఏదైనా పెద్ద అద్భుతం జరిగి తమ పిల్లలు కనిపిస్తారేమో అని ఆశతోనే వస్తాం!'' అని వాళ్ళు ఇద్దరూ చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకున్నాను. వాళ్ళు దొరకాలని. 'నిజానికి అది అసంభవం అని తెలుసు' అన్నాడు. అతనికి డబ్బులిచ్చేసి ప్యాకెట్‌ తీసుకొని వస్తున్న తారిఖ్‌ మనసులోనే 'అయ్యో! ఎంతపని జరిగింది? మరి ఇన్నేళ్ళూ నేను ఎందుకు గమనించలేదు? పోనీలే ఇప్పటికైనా తెలిసింది వాళ్ళ గురించి' అనుకున్నాడు.
అప్పటి నుంచి తారిఖ్‌ మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. అది వెంటనే వర్షకి, జాన్‌కి కూడా చెప్పాడు. ముగ్గురూ ''సరే అంటే సరే'' అనుకున్నారు.
***
వాళ్ళ ఇద్దరినీ విడివిడిగా కలిసి, తీసికొచ్చి అక్కడ కూర్చోపెట్టారు. తారిఖ్‌, వర్ష నిజంగా వాళ్ళ పిల్లలయితే ఎలా మాట్లాడతారో అలాగే వాళ్లని చనువుగా పలకరించి, మాట్లాడారు.
అనుకున్నట్లుగానే వాళ్ళ కళ్ళలో ఆనందం కనిపించింది. వాళ్ళ అన్వేషణకి ఒక ముగింపు దొరికింది. పోగుట్టుకున్న తమ పిల్లలు పదకొండేళ్ళ తరువాత దొరికినట్లుగా సంబరపడుతున్నారు. 'ఈ వయసులో వాళ్ళకి కావలిసింది పిల్లల ప్రేమ, అనురాగం కదా! మనం వాళ్ళకి అందిద్దాం! మనకి అమ్మనాన్న ఉన్నారనే సంతోషం కూడా ఉంటుంది. పైగా ఏ లోకాలలో ఉన్నా తాతగారు మనం చేసిన పనికి ఆనందపడతారు' అనుకున్నారు తారిఖ్‌, వర్ష.
***
నిజానికి ఆ ఊర్లో వాళ్ళకి శారదా మాధవరావు విషాద కథ తెలుసు.
గత పదకొండేళ్ళ నుంచి వాళ్ళు పడుతున్న బాధ, ఆ దుఃఖం వర్ణనాతీతం.
అంత బాధలోనూ ఎంతోమంది అనాథ పిల్లలకి సాయం చేశారు. కాకపోతే ఎవరినైనా పెంచుకుందామనే ఆలోచన మటుకు దగ్గరికి రానీయలేదు.
అందుకు కారణం ఉంది. అనుబంధం పెంచుకున్నాక అది ఏ రూపంలోనైనా తెగిపోతే తట్టుకునే శక్తిలేదు ఇద్దరికీ. అందుకే జీవితంలో ఆ ప్రసక్తే లేకుండా చేసుకున్నారు. అయితే వాళ్ళకి మరో రూపంలో పిల్లలు దొరికారు. నిజానికి ఆ పిల్లలే వీళ్ళని అమ్మానాన్నలుగా స్వీకరించారు. దాన్ని అందరూ హర్షించారు. జరిగినదంతా మీడియాకి తెలియడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
***
అది వీక్‌ ఎండ్‌ కావడంతో మాధవరావు, శారద ఎవరి సెల్‌ఫోన్స్‌ వాళ్ళ దగ్గర పెట్టుకునే ఉన్నారు. పిల్లల దగ్గర్నుంచి కాల్స్‌ వస్తాయని. ప్రతి వారం ఎదురు చూస్తున్నట్లే ఈ వారం కూడా చూస్తున్నారు.
అయితే ఈ మాటు వాళ్ళు చేసే ఫోన్‌ ఎప్పుడూ చేసేదిలాంటిది కాదు. కొంత ప్రత్యేకత ఉంది.. తారిఖ్‌ ఏదో సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పాడు. అంతేకాదు వాళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారనేది తెలిపే సంతోషకరమైన విషయం కూడా ఉంది. అందుకే ఫోన్‌రింగ్‌ కోసం చెవులు రిక్కించి, ఇద్దరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
                                                      * మణి వడ్లమాని, 09652067891