Feb 04,2021 07:17

అంతర్జాతీయ పెట్టుబడికి ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఇటీవల ఒక్కసారిగా ''దేశాల మధ్య పరస్పరం సహకారం'' ఎంత గొప్ప విషయమో వివరించడం మొదలెట్టారు. దానితోబాటు కోవిడ్‌-19 కి సంబంధించిన వ్యాక్సిన్‌ను భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరికీ అందించవలసిన ఆవశ్యకత గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటూంటే ఈ ప్రపంచం గాని ఒక్కసారి తల్లకిందులైపోయిందా అన్న అనుమానం రాక మానదు. తన తాజా నివేదికలో ఐఎంఎఫ్‌ ''బలమైన బహుముఖ సహకారం'', ''వ్యాక్సిన్ల సార్వత్రిక పంపిణీ'', ''అందరికీ అందుబాటులో ఉండే ధరలు'' వంటి పదాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమెలా అన్న చర్చ సందర్భంగా ఉపయోగించింది. అంతర్జాతీయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసిసి) బహుళజాతి గుత్త పెట్టుబడికి ప్రతినిధిగా తనకు తానే ప్రకటించుకుని వ్యవహరించే సంస్థ. ఆ సంస్థ ఒక నివేదికను తయారుచేసింది. సంపన్న దేశాలు తమ స్వప్రయోజనాల రీత్యా చూసినా వ్యాక్సిన్‌ను మొత్తంగా తామే నిల్వ ఉంచుకోవడం కన్నా దానిని పేద దేశాలతో పంచుకోవడమే మంచిదని ఆ నివేదికలో సూచించింది.
జనవరి 2021లో ఐఎంఎఫ్‌ ప్రచురించిన 'వరల్డ్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ అప్‌డేట్‌' ప్రకారం 2021 ద్వితీయార్ధ భాగంలో (జూలై-డిసెంబర్‌ 2021) ప్రపంచ జిడిపి పుంజుకోవడం జరుగుతుందని, ప్రస్తుతం 3.5 శాతం పడిపోయిన ప్రపంచ జిడిపి 2021 ద్వితీయార్ధంలో కోలుకుని 2019తో పోల్చినప్పుడు 2 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఈ కోలుకోవడం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని, ఆ దేశాలతో పోల్చితే సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలలో కోలుకోవడం బాగా తక్కువగా ఉంటుందని తెలిపింది.
ట్రంప్‌ నాయకత్వం వ్యాక్సిన్‌ విషయంలో ''ముందు మన దేశానికి కావలసినది తెచ్చుకుందాం, ఆ తర్వాతే తక్కిన వారి సంగతి చూద్దాం'' అన్న విధానాన్ని అనుసరించింది. అయితే అటువంటి విధానం వలన సంపన్న దేశాలు 20,300 కోట్ల డాలర్ల నుండి 5 లక్షల కోట్ల డాలర్ల వరకూ నష్టపోయే ప్రమాదం ఉందని ఐసిసి హెచ్చరించింది!
ఇదెలా అని ఆశ్చర్యపోవద్దు. ఎలాగో ఐసిసి వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌ సేకరణ కోసం ''ఏక్ట్‌ ఏక్సిలరేటర్‌ ప్రోగ్రాం'' అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దాని ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకూ సరిపడా వ్యాక్సిన్‌ ను సేకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమానికి అయ్యే పెట్టుబడి 3800 కోట్ల డాలర్లు. దానికి ఇప్పటి వరకూ సేకరించినది పోను ఇంకా 2720 కోట్లు కావాలి. ఆ మొత్తాన్ని గనుక సంపన్న దేశాలు పెట్టుబడిగా పెడితే, ఆ పెట్టుబడికి 166 రెట్లు లాభం వస్తుంది అని ఐసిసి లెక్క వేసింది. సూటిగా చెప్పాలంటే ప్రపంచానికంతటికీ వ్యాక్సిన్‌ ను అందిస్తే అందుకు పెట్టుబడి పెట్టిన సంపన్న దేశాలకు అత్యధికంగా 166 రెట్ల లాభం వస్తుందన్నమాట!
ప్రస్తుత కాలంలో ప్రపంచంలో ఏ ఒక్క దేశమూ విడిగా, ప్రత్యేకంగా, తక్కిన ప్రపంచంతో సంబంధం లేకుండా మనజాలదు. ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఇతర దేశాలతో సంబంధాలు ప్రతీ దేశానికీ ఉంటాయి. తమకు కావలసిన ముడిసరుకులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుని తాము ఉత్పత్తి చేసిన సరుకులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తేనే వృద్ధి సాధ్యమౌతుంది. సంపన్న దేశం గాని, అభివృద్ధి చెందుతున్న దేశం గాని అన్నీ పరస్పరం సంబంధం కలిగివున్నాయి. ఈ విషయాన్నే ఐసిసి సంపన్న దేశాలకు గుర్తు చేసింది.
''మానవీయ కోణం నుంచో, నైతిక కోణం నుంచో కాకపోయినా వ్యాక్సిన్‌ను ప్రపంచానికంతటికీ అందించే విషయాన్ని ఆర్థిక కోణం నుంచైనా మనం చూడాలి. సంపన్న దేశాలన్నీ తమ తమ దేశాల ప్రజలకు 2021 వేసవి అంతానికల్లా వ్యాక్సిన్‌ను అందించేందుకు సన్నాహాలు చేసుకున్నాయి. కాని తక్కిన దేశాలలో అప్పటికి ఆ పరిస్థితి ఉండదు. ఆ దేశాలకు తమ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందించే స్తోమత లేదు. ప్రపంచం యావత్తూ వ్యాక్సినేషన్‌ జరిగితే తప్ప ఎవరికీ కోవిడ్‌-19 నుండి విముక్తి లేదు. సంపన్న దేశాల లాభాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండే వస్తాయి. అటువంటప్పుడు తక్కిన దేశాలలో వ్యాక్సినేషన్‌ పూర్తి కాకపోతే ఆ లాభాలెలా వస్తాయి? ''అందరూ క్షేమంగా ఉంటే తప్ప మనం కరోనా నుండి క్షేమంగా ఉండలేం'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ టెడ్రోస్‌ గెబ్రియేసస్‌, యూరపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు డా|| ఉర్సులా అన్నారు. దీనినే ఆర్థిక వ్యవస్థలకు కూడా వర్తింపజేయాలి. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కోలుకుంటే తప్ప కేవలం సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కోలుకోలేవు'' అని ఐసిసి చెప్పింది.
ఒకప్పుడు ఇవే మాటలను ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే దానిని ట్రంప్‌ అనరాని మాటలన్నీ అనడమే గాక, ఆ సంస్థకు ఇవ్వవలసిన నిధులను సైతం నిలిపివేశాడు. కాని విచిత్రంగా ఇప్పుడు అవే మాటలను బడా పెట్టుబడికి ప్రతినిధి అయిన ఐసిసి అంటున్నది! తన స్వార్ధం కోసమే పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ విషయాన్ని చెప్పినా అది చెప్పిందే వాస్తవం కూడా.
అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా సంగతి చూస్తే చాలా గడ్డు పరిస్థితే నెలకొని వుంది. చాలా సంపన్న దేశాలు ''వ్యాక్సిన్‌ జాతీయవాదం'' (ట్రంప్‌ ప్రవచించినది) తోటే ఇంకా కొట్టుకుపోతున్నాయి. వ్యాక్సిన్‌ పంపిణీ విషయం ఎంత ఎగుడుదిగుడులుగా ఉందో డ్యూక్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది.
సంపన్న దేశాలు 420 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ను కొనుగోలు చేస్తే, మధ్యతరహా దేశాలు 154 కోట్ల డోసులను, పేద దేశాలు కేవలం 27 కోట్ల డోసులను కొనుగోలు చేశాయని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది.
వివరాలను బట్టి 2024కి కూడా ప్రపంచ వ్యాప్త వ్యాక్సినేషన్‌ సాధ్యంకాదని స్పష్టం అవుతోంది. మరి ఆర్థికంగా కోలుకోవాలంటే 2021 సంవత్సరాంతానికే ప్రపంచ జనాభా అంతటికీ వ్యాక్సినేషన్‌ జరగాలి. ఒక పక్క అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తమ జనాభాకు అవసరమైన దానికన్నా రెండు, మూడు రెట్లు వ్యాక్సిన్‌ ను కొనుగోలు చేశాయి.
ఇక మన దేశానికొస్తే మన దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే సేకరించాం. మోడీ ప్రభుత్వం ఒక వైపు వ్యాక్సిన్‌ విషయంలో ప్రపంచంలో అగ్రశ్రేణిలో మనం ఉన్నట్టు గొప్పలు చెప్పుకుంటోంది. కాని ఇప్పటికి మన దేశం ఆర్డరు ఇచ్చింది 11 కోట్ల 65 లక్షల డోసులకు మాత్రమే. అందులో 10 కోట్ల డోసులు 'గామాలేయా స్ఫుత్నిక్‌' కి ఇచ్చారు. అయితే ఆ 'స్ఫుత్నిక్‌ వి' అనే వ్యాక్సిన్‌ కు మన దేశ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం ఇంకా ఇవ్వలేదు. 'ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా-జెన్కా' వ్యాక్సిన్‌ ను ఉత్పత్తి చేసే సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1 కోటి 10 లక్షల డోసులు, భారత్‌ బయోటెక్‌ నుంచి 55 లక్షల 'కోవ్యాక్సిన్‌' డోసులు మాత్రమే ఇప్పటికి ఖరారు అయినవి. ఈ లెక్కన 140 కోట్ల జనాభాకి సరిపడా వ్యాక్సిన్‌ ఎప్పటికి అందుతుందో ఎవరు చెప్పగలరు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన 'కోవ్యాక్స్‌' అనే సహాయ కార్యక్రమం కింద సేకరించిన విరాళాలతో 2021 నాటికి 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ను 100 కోట్ల మంది జనాభాకు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో ఇది అయిదో వంతు మాత్రమే, ఇందులో కూడా సగం లక్ష్యాన్ని మాత్రమే కోవ్యాక్స్‌ చేరుకోగలుగుతుంది. సంపన్న దేశాలు తమ అవసరాలకు మించి సేకరించడమే దీనికి కారణం.
ఇన్నాళ్ళూ బూర్జువా సిద్ధాంతవేత్తలు సంపద వృద్ధి చెందాలంటే స్వార్ధం ఉండాలని ప్రబోధించారు. ఇప్పుడు అది సంపన్న దేశాలకు అనుల్లంఘనీయమైన సూత్రంగా తయారైంది. ఇతర దేశాల ప్రజలతో వ్యాక్సిన్‌ ను పంచుకోవడం సంగతి పక్కన పెడితే, ఆ దేశాలలో అసలు మాస్క్‌ ధరించడం అంటేనే తమ స్వేచ్ఛకు భంగం అనే వికృత వాదన కొనసాగింది. అటువంటి దేశాలు తమ డబ్బు సంచులను తెరిచి పేద దేశాలకు వ్యాక్సిన్‌ సహాయం చేయడానికి సిద్ధపడతాయా? అలా సహాయం చేయడం తమ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం కోసమే కావచ్చు కాని అందుకు సంపన్న దేశాలు ముందుకు రావడం ప్రశ్నార్ధకమే. ఆ దేశాలు ఎప్పటికీ భయపడే ముప్పు ''సోషలిస్టు ప్రమాదం''. ఇటువంటి సహాయాలు ఆ సోషలిజం వైపు ప్రజల ఆలోచనలను మళ్ళించే ప్రమాదమే వారిని భయపెడుతోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా లో వారి నినాదం ''బెటర్‌ డెడ్‌ దేన్‌ రెడ్‌'' (విప్లవాన్ని ఒప్పుకోవడం కన్నా చావడం మేలు).
ఈ భూగోళం మీద మానవాళి ఉనికికే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదాలు- అది కోవిడ్‌ మహమ్మారి కాని, భూ ఉష్ణోగ్రతలు పెరగడం కాని- ముంచుకొస్తేనే కాని కొందరికి వామపక్ష వాదులు ఇన్నేళ్ళూ గొంతులు చించుకుని చెప్తున్న విషయం అర్ధం కాదేమో. మనం ఒక జీవ జాతిగా కలిసి వృద్ధి చెందాలి, లేదా మన జాతి మొత్తంగా అంతరించిపోతుంది.
''తనకు తానుగా ఏ మనిషీ ఒక్కడై మనలేడు
ప్రతీ మానవుడూ ఈ భూఖండంలో ఒక భాగమే,
మొత్తంలో ఒక భాగమే
అందుచేత వచ్చే ముప్పేదో నా వరకూ రాదులే అని ఎన్నడూ అనుకోమాకు
ఆ ముప్పు నీకూ తప్పదు''
అని జాన్‌ డాన్‌ అనే కవి 17వ శతాబ్దం లోనే అన్నాడు.
                                              ప్రబీర్ పురకాయస్థ  -    ప్రబీర్ పురకాయస్థ     (స్వేచ్ఛానుసరణ)