ఆయన ఒక లైబ్రేరియన్. లైబ్రరీలో పెద్దగా సభ్యులు లేకపోవడం చూసి మొదట్లో విస్తుపోయారు. ప్రజల్లో పఠనాసక్తి తగ్గడానికి టెలివిజనే కారణం అని గుర్తించారు. అందరి లాగా నాకెందుకులే అని వదిలేయలేదు.. ఎలాగైనా ప్రజల్లో మునుపటిలా పఠనాసక్తిని పెంచాలి అనుకున్నారు. అందుకోసం తానే ఒక 'వాకింగ్ లైబ్రేరియన్'గా మారారు. రోజుకు 12కి.మీ నడుస్తూ ఇంటింటికీ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఒకనెల, రెండు నెలలు కాదు.. ఏకంగా 41 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆయనే కేరళకు చెందిన కుమారపురం పబ్లిక్ లైబ్రరీ లైబ్రేరియన్ సుకుమారన్. ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు..
సుకుమారన్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే చాలా ఇష్టం. వాటి గురించి జరిగే చర్చల్లో పాల్గొని సంతోషపడేవారు. 1979లో కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ పరిధిలోని హరిపాడ్ సమీపం కరువట్ట సౌత్ కుమారపురం పబ్లిక్ లైబ్రరీలో లైబ్రేరియన్‌గా చేరారు. ఆ లైబ్రరీలో చాలా తక్కువమంది సభ్యులు ఉండేవారు. దీంతో పుస్తక పఠన విలువను ప్రజలలో పెంపొందించేందుకు ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన ఆయన 'వాకింగ్ లైబ్రేరియన్'గా మారారు. కాలినడకన రోజుకు 12 కి.మీ ప్రయాణం చేసి పుస్తకాలను ఇంటింటికీ పంపిణీ చేసేవారు. ఇలా 41 సంవత్సరాలపాటు కష్టపడుతూనే ఉన్నారు.
ప్రతిరోజూ 61 ఏళ్ల సుకుమారన్ లైబ్రరీలోని 11 వార్తాపత్రికలను ముందుగా చదువుతారు. తర్వాత సుమారు 60-70 పుస్తకాలను రెండు సంచుల్లో నింపుకుని, ఇంటింటికీ పంచడానికి కాలినడకన బయలుదేరతారు. ఆ ప్రాంతంలో ఒక్కో ఇల్లూ చాలా దూరంగా ఉంటాయి. దూరాన్ని లెక్కచేయరు. సైకిల్ తొక్కడమూ రాని ఆయన రోజుకు దాదాపు 30 ఇళ్లను సందర్శించేవారు. ప్రతినెలా వెయ్యి కంటే ఎక్కువ పుస్తకాలను పంపిణీ చేసేవారు.. ఇలా 41 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. 'చిన్నప్పుడు వార్తాపత్రికలను పంచేవాడిని. అప్పట్లో మైళ్ల దూరం నడిచే అలవాటు ఉంది. అందుకే ఈ వయస్సులోనూ అంతదూరం నడిచినా అలసట ఉండదు. ఇంకా రవాణా మార్గాల కంటే నడవడానికే ఇష్టపడతాను. నడకలో ప్రకృతితో మమేకమై ఉంటాను' అంటున్నారు సుకుమారన్.
ఎన్నో అవరోధాలు
'కుమారపురం పౌర గ్రంథాలయం ప్రారంభమైనప్పటి నుంచి రెండు గదులతో పనిచేస్తోంది. ఇది ఒకప్పుడు 20,000 పుస్తకాలతో అత్యుత్తమ లైబ్రరీల్లో ఒకటి. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. 2019 వరదల సమయంలో, సుమారు 6,000 పుస్తకాలు దెబ్బతిన్నాయి. భవనం పైన చెట్టు పడింది. ఎప్పటి నుంచో దీనస్థితిలో ఉంది. మా దగ్గర కొన్ని అరుదైన పుస్తకాలూ ఉన్నాయి. సౌకర్యాల కొరత కారణంగా పదిమందికి మించి లైబ్రరీలో పట్టరు. ఇలాంటి అవరోధాలు లేకుంటే ఈ లైబ్రరీకి ఇప్పటికే 'అత్యుత్తమ గ్రంథాలయం'గా గుర్తింపు వచ్చేది' అంటున్నారు సుకుమారన్. ఇప్పటికి స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ స్టాఫ్ అసోసియేషన్ ఆయనకు రెండు బహుమతులను ఇచ్చింది. ఇన్నాళ్లూ ఆయన చేసిన కృషికి, సహకారానికి గాను 'దాస్ అవార్డు' అవార్డు వచ్చింది. సుకుమారన్‌ను సంప్రదించ దలచుకున్నవాళ్లు 9747451348 ఈ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చు.