ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్ట నివారణకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ పి.రాజేష్ తెలిపారు. బుధవారం పట్టణంలో పలువురు వాహనదారులకు హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతూ ప్రాణనష్టం, శారీరకంగా నష్టాలు జరుగుతున్ననాయని తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. నిత్యం హైవేలపై వాహన చోదకులకు 'వాష్ అండ్ డ్రైవ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవ్వటం వలన ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతిఒక్కరూ హెల్మెట్లు ధరించడం వలన ప్రమాద సమయాలలో ప్రాణాపాయం కాకుండా కాపాడుకోగలుగుతామని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు గురించి విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈక్రమంలో ప్రతీ స్కూలు, కాలేజీలలో రహదారి ప్రమాదాలపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్, పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










