ప్రజాశక్తి-నెల్లూరు :ఉప రవాణా కమిషనర్ శ్రీ చందర్ ఆదేశాల మేరకు రవాణా శాఖకు చెందిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు గురువారం తెల్లవారుజామున వెంకటాచలం టోల్‌గేట్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిని అదులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా చెన్నై నుండి కర్నూలుకు వెళ్తున్న వేగా ట్రావెల్స్ కాంట్రాక్ట్ క్యారేజీ బస్సును ఆపి తనిఖీ చేయగా సదరు డ్రైవర్ మద్యం సేవించి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మద్యం సేవించి ఉన్న డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సును ఆర్టీసీ డిపోలో అధికారులకు స్వాధీనం చేశారు. ఆ సమయంలో ప్రయాణికులను దించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరో వాహనంలో వారిని కర్నూలు తరలించారు. తనిఖీల్లో వెంకటరమణ ట్రావెల్స్ తిరుపతి నుండి విజయవాడ వెళుతుండగా ఆపి తనిఖీ చేయగా తత్సం బంధితత్రైమాసిక పన్ను, పర్మిట్ లేకుండా ఉండటాన్ని గుర్తించి రూ.1,23,000/- అపరాధరరుసుము, పెనాల్టీ విధించగా వెంటనే చెల్లించారు. కందుకూరు నుండి బెంగళూరు వెళ్తున్న రాజేశ్వరి ట్రావెల్స్ బస్సు నేషనల్ పర్మిట్ టాక్స్ కట్టకుండా తిరుగుతున్న కారణంగా రూ.1,48,900/- అపరాధరసుము , పెనాల్టీ విధించారు.కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల్లో సరుకు రవాణా చేయుచుండగా దాదాపుగా 12 బస్సులపై అపరాధ రుసుం గా రూ. 1,20,00లను రవాణాశాఖ అధికారులు విధించారు. మద్యం తాగి వాహనం నడిపే డ్రైవర్ల పై మోటర్ వాహనాల తనిఖీ అధికారులు కేసులు నమోదు చేయటం పట్ల ఉప రవాణా కమిషనర్ శ్రీ చందర్ అభినందనలు తెలిపారు.అధికారులు బాలమురళీకష్ణ, కార్తీక్ పవన్ కుమార్, పూర్ణచంద్ర రావు, స్వప్నిల్ కుమార్ రెడ్డి రఘువర్థన్ రెడ్డి పాల్గొన్నారు.










