Sep 17,2023 21:48

ప్రజాశక్తి - ముదినేపల్లి
   ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో పూజలు అందుకునేందుకు గణనాధుని విగ్రహాలు వాహనాలపై గ్రామాలకు తరలి వెళుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఉత్సవాల కమిటీ నిర్వాహకులు వివిధ వాహనాల్లో ముదినేపల్లి చేరుకుని విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గణేష్‌ విగ్రహాలను వివిధ వాహనాల్లో ఎక్కించి ఊరేగింపుగా తమ గ్రామాలకు తరలి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు డప్పు వాయిద్యాలతో, యువకుల నృత్యాలు, కేరింతల నడుమ ఊరేగింపుగా విగ్రహాలను గ్రామాలకు తీసుకు వెళుతున్నారు. దీంతో ముదినేపల్లి సెంటర్‌ కోలాహలంగా మారింది. అదేవిధంగా వైకూడలి వద్ద ఉత్సవపూజా సామాగ్రిని వ్యాపారులు జోరుగా విక్రయిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రోడ్డు మార్జిన్లలో దుకాణాలు ఏర్పాటు చేసి పూజా సామాగ్రిని విక్రయిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పూజా సామాగ్రిని కొనుగోలు చేసి, తమ వెంట తీసుకెళుతున్నారు. వివిధ గ్రామాల నుంచి యువతీ, యువకులు, చిన్నలు, పెద్దలు, ముదినేపల్లి సెంటర్‌ చేరుకుని విగ్రహాలను, పూజా సామాగ్రిని కొనుగోలు చేసి తీసుకెళ్లడంతో ముదినేపల్లి సెంటర్‌ సందడిగా మారింది.