ప్రజాశక్తి-రాంబిల్లి
వాహన పన్ను పెంపును వ్యతిరేకిస్తూ స్థానిక శ్రీకనకదుర్గ ఆటో, లారీ డ్రైవర్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు బద్ది భాస్కరరావు, నాయకులు సిహెచ్ శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో సరుకు రవాణా, ప్రయాణికులు రవాణా వాహనాలపై ప్రభుత్వం పెంచిన 30శాతం పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరోనాతో కష్టాలు పడుతున్న రవాణా రంగంపై డీజిల్ ధరలు, టోల్‌గేట్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారులు కేసులు రాసి ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం రవాణా కార్మికులను ఆదుకోకపోగా ఇటువంటి భారాలు వేసి రవాణా రంగాన్ని మరింత ఇబ్బందులు గురి చేయడం తగదని పేర్కొన్నారు. జీవో నెంబర్ 21 వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఈ పెంపుపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి మాధవ్, ఉపాధ్యక్షులు శేషు, తాతారావు, లారీ డ్రైవర్ యూనియన్ నాయకులు రమణ, రాంబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.










