ప్రజాశక్తి - బాపట్ల
వాహన చోదకుల అప్రమత్తతే సురక్షిత ప్రయాణానికి మార్గమని బాపట్ల డిఎస్‌పి వెంకటేశులు తెలిపారు. స్థానిక ఎన్‌జిఒ హోంలో వివిధ వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ రెప్పపాటులో జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. వాహనాలు నడిపే సమయాల్లో అత్యంత జాగ్రత్త అవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇటీవల జరుగుతున్న అనేక ప్రమాదాలు కేవలం అవగాహన లోపం వల్లే జరుగుతున్నట్లు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకునే జాగ్రత్తలు ఎంతో ప్రధానమన్నారు. కొద్దిపాటి అవగాహన ఉంటే అతిపెద్ద ప్రమాదాలను కూడా అరికట్ట వచ్చన్నారు. మద్యం తాగి వాహనాలు నడపటం అనేక అనర్థాలకు దారితీస్తుందని తెలిపారు. నిర్లక్ష్యం, అజాగ్రత్త, అవగాహన లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల రవాణా శాఖ ఎంవిఐ రంగారావు మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వాతావరణానికి అనుకూలంగా డ్రైవర్లు వాహనాలు నడపాలన్నారు. వర్షాకాలంలోవానలు. శీతాకాలం దట్టమైన పొగ మంచులో అత్యంత జాగ్రత్తగా అన్ని వైపులా గమనిస్తూ వాహనాలు నడపాలి. మలుపుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సిగల్ వేయకుండా వాహనం క్రాస్ చేయడం ప్రమాదకరమని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. మద్యం సేవించి వాహనం నడపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ సిఐ కష్ణయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ సుధాకర్ పాల్గొన్నారు.










