వాడు పిలగాడే! అయితేనేం?
సూర్యుడు అంతటి వాడు
నింగిలోని చుక్కలు
ఒక్కొక్కటి మాయమవుతుంటే
తొలిపొద్దున పయనం మొదలుపెడతాడు
గడప గడపను ఆప్యాయంగా తడిమి
''పేపర్'' అన్న పిలుపునే
సుప్రభాత రాగంగా మలిచి
నిద్రలేపే వేకువ పిట్టవాడు
ప్రపంచాన్నే అందరికీ చేరువచేస్తూ
పస్తులతో కడుపు నింపుకునే వేకువ జాము శ్రామికుడు
ఓపిక పిట్టను గుప్పిట బిగించి
సత్తువను కాళ్ళపై నిలిపి
కాలమనే రెండు చక్రాల పయనాన్ని
సాగించే యాత్రికుడు
వార్తలు చేరవేసే వారధి కానీ
జ్ఞాన మెరుగని నిరంతర ప్రవాహి అతను
కష్టాల సాగరంలో కదలలేనప్పుడు
ఇంటిని నావకు తెడ్డై ఒడ్డుకు చేర్చేవాడు
బహుశా వాడు
తన ఇంటికి కన్నతల్లి అయిఉంటాడు
కష్టం ఎవరికి వచ్చినా
ఇంట్లో వాళ్లకు
వెలుగు రేఖై ఎదురొచ్చేవాడు
ప్రతి పయనంలోను అడుగుల జాడయ్యే
ముద్దుల తమ్ముడే కావొచ్చు కానీ
అన్ని బంధాలను ఆత్మీయంగా చేయివేసి
నైరాశ్యంలోనూ నీడనిచ్చే చెట్టై ఓదార్పు మాటలతో
అన్నం పెట్టేవాడు కావొచ్చు
కష్టం చేసి గింజలు సంపాదించి
నాలుగు ముద్దలు మరొకరి నోటికి అందించే వాడేవడైనా
ఓ అమ్మే కదా!
వార్తలు వెదజల్లి నాలుగు గింజలు మోసుకొచ్చే
వాడు కూడా ఓ అమ్మే!
- రజిత కొండసాని
7399199099