- ఆడిట్‌పై ప్రశ్నల వర్షం
ప్రజాశక్తి - విజయవాడ : నగరపాలక సంస్థ ఆదాయ వ్యయాల పద్దులపై ఆడిట్ వివరాల సమగ్ర సమాచారాన్ని సభ్యులకే ఇవ్వనప్పుడు పారదర్శకతకు అర్ధమేముంటుందని, అవకతవకలు జరగవనే గ్యారెంటీ ఏమిటని సిపిఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు నిలదీశారు. ఈ పద్దులపై ఆడిటింగ్ ఎప్పటి వరకు పూర్తి చేశారు? ఆడిటింగ్‌తో గుర్తించిన లోపాలు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి, ప్రతి ఏడాది ఆడిట్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నోత్తరాల సమయంలో సత్యబాబు ప్రశ్నించారు. దీనిపై అధికారుల నుంచి కనీస సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన మండిపడ్డారు. రూ.1060 కోట్ల బడ్జెట్‌పై ఆడిట్ వివరాలు అంకెల్లో చూపారు తప్ప సమగ్ర సమాచారం సభ్యులడిగినా ఇవ్వరా అని మండిపడ్డారు. దీనిపై ఎఒ నరసింహమూర్తి మాట్లాడుతూ 2019-20కు సంబంధించి ఆడిట్ జరిగిందని, 2020-21కు ఆడిట్ జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ఆడిట్ విభాగం వారు ఈ వ్యవహారం చేస్తున్నారని తెలిపారు. వివరాలను సిడి రూపంలో ఇస్తామన్నారు. డి అండ్‌ఒ ట్రేడ్ లైసెన్స్ రూపంలో విఎంసి రావాల్సిన రాబడిని సకాలంలో రాబట్టలేకపోతున్నారని టిడిపి సీనియర్ సభ్యులు ముమ్మనేని వెంకటప్రసాద్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి 8,356 మంది డిఅండ్‌ఒ ట్రేడ్ లైసెన్స్‌దారుల వద్ద నుంచి రూ.1.72 కోట్లు రావాల్సి ఉందని అధికారులే ఒప్పుకున్నారని, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లెక్కలు కూడా లేకపోవడం దారుణమని అన్నారు. బకాయిలు, బకాయిదారుల వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు సరిగా స్పందించకపోవడంతో నిరసన తెలిపారు. ఇదే అంశంపై వైసిపి సీనియర్ సభ్యులు బండి నాగేంద్ర పుణ్యశీల అధికారుల తీరును తప్పుబట్టారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జోక్యం చేసుకుంటూ పెండింగ్ బకాయిలను వీలైనంత త్వరగా వసూలు చేయాలని ఆదేశించారు. సభ్యులడిగిన ప్రశ్నకు నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమాధానమిస్తూ గత ఆర్థిక సంవత్సరం పెండింగ్ బకాయిలను నెల రోజుల్లోపు ప్రత్యేక డ్రైవ్ ద్వారా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలాలకు పన్ను వసూలులో అధికారులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని టిడిపి సభ్యులు వెంకటప్రసాద్ విమర్శించారు. విఎల్‌టి ట్యాక్స్ బకాయిలపై ఆయన అడిగి ప్రశ్నకు అధికారుల నుండి సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మూడు సర్కిల్స్ పరిధిలో ఖాళీ స్థలాల పన్ను అసెస్మెంట్లు 15,353 ఉన్నాయని, వీటి డిమాండ్ రూ.206.63 కోట్లు ఉందని, పన్ను చెల్లించిన అసెస్మెంట్లు 3,119కు సంబందించి రూ.12.43 కోట్లు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ (డిసిఆర్) వెంకటలక్ష్మి సమాధానమిచ్చారు. 2022-23లో బకాయి ఉన్న అసెస్మెంట్లు 12,234 వద్ద నుండి రూ.194.19 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ సమాధానంపై పార్టీలకతీతంగా సభ్యులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో నగరంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయం ఎక్కువైందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సభ్యులు ముమ్మనేని వెంకటప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని సిపిఎం ఫ్లోర్‌లీడర్‌తోపాటు వైసిపి సభ్యులు వ్యక్తం చేశారు.










