Aug 31,2023 22:33

వాగ్వాదానికి దిగిన అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు

ప్రజాశక్తి-హిందూపురం : కౌన్సిల్‌ ఏర్పడినప్పటి నుంచి ప్రతి సారి జరిగే కౌన్సిల్‌ సమావేశంలో వార్డుల అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తున్నారు, అయితే అభివృద్ది ఎక్కడ జరగడం లేదని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌ను, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ను నిలదీశారు.
గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ అద్యక్షతన కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అధికారులు 21 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌ దృష్టికి తీసుకోచ్చారు. తొలుత ఇటీవల వృతి చెందిన మున్సిపల్‌ ఎంఈ ఈశ్వరయ్య మృతికి నివాళులు అర్పించారు. అనంతరం అజెండాపై చర్చను ప్రారంభించాలని చైర్‌పర్సన్‌ ఇంద్రజ సూచించారు. దీంతో పలువురు కౌన్సిలర్లు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. 25వ వార్డులో రూ.5.10లక్షల నిధులతో అభివృద్ది చేశామని నిధులు సైతం డ్రా చేశారని, ఆ నిధులతో ఏమి అభివృద్ది చేశారో చూపించాలని వార్డు కౌన్సిలర్‌ రాఘవేంద్ర మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ను నిలదీశారు. రెండున్నర ఏళ్లుగా వార్డుల్లో కనీస అభివృద్ది సైతం చేపట్ట లేదని...వార్డు పర్యటనకు వెళితే ప్రజలు నిలదీస్తున్నారని అభివృద్ది చేయక పోతే ఇక వార్డుల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదని పలువురు కౌన్సిలర్లు అన్నారు. ప్రతి పక్ష కౌన్సిల్‌ నేత రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ మహిళా కౌన్సిలర్‌ భారతీ తన వార్డులో అభివృద్ది జరగలేదని ఇప్పటికి చాలసార్లు సభ దృష్టికి తీసుకోచ్చిన స్పందించలేదన్నారు. దీంతో ఆమె కళ్లకు, నోటికి నల్ల రిబ్బను కట్టుకుని సభకు వచ్చిన దానిపై ఎవరు మాట్లాడక పోవడంపై దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్‌ ఇంద్రజ మాట్లాడుతూ వార్డులో ఏమి అభివృద్ధి కావాలో నివేదికను ఇవ్వకుండా ఇలా నిరసన చేయడం తగదని సూచించారు. దీంతో ఒక్క సారిగ ప్రతి పక్ష కౌన్సిలర్లు అందరు లేసి తమ వార్డుల్లో ఇప్పటికి ఏ అభివృద్ది జరగలేదని, దీంతో వార్డుల్లో తిరగలేక పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంలో అధికార, ప్రతి పక్ష కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది జరుగుతుండగానే కౌన్సిలర్‌ రాఘవేంద్ర చైర్‌పర్సన్‌ పోడియం ముందు బైఠాయించి టిడిపి ప్రాతినిత్యం వహిస్తున్న వార్డుల అభివృద్దికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. చైర్‌ పర్సన్‌ ఎంత చెప్పిన వారు వినలేదు. చివరకు వైస్‌ ఛైర్మన్‌ బలరామిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధినికోరుకునే వారు ఇలా సభను అడ్డుకోవడం తగదని, ఎదైనా ఉంటే చర్చించాలని వారికి సూచించారు. దీంతో సభ ప్రారంభం అయింది. కౌన్సిలర్‌ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ పురపాలక సంఘం ఆధీనంలో ఉన్నా ప్రవేటు బస్టాండ్‌ నమ్ముకుని 100 నుంచి 150 మంది వరకు పేద ప్రజలు ఆధారపడి జీవనం చేస్తున్నారని అయితే కూరగాయల హోల్‌సేల్‌ వ్యాపారులు వారికి కేటాయించిన స్థలంతో పాటు మొత్తం బస్టాండ్‌ ఆక్రమించుకుంటున్నారని, దీంతో బస్టాండును నమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్న పేదలు రోడ్డున పడుతున్నారని, వారిని మానవత్వంతో ఆదుకోవాలని కోరారు. ఇలా పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ ప్రణాళిక విబాగంలో అవినీతి రాజ్యమేలుతుందని, ప్రతి పనికి మామూళ్లు దండుకుంటున్నారని, లిఖిత పూర్వకంగా అధికార పార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. సమావేశం వాడి వేడిగ జరిగినప్పటికి అజెండాలోని అన్ని అంశాలను అమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్‌తో పాటు అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంభూపాల్‌ రెడ్డి, అన్ని విభాగాల అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.