Nov 23,2022 00:14

అటవీ ఉద్యోగిని నిలదీస్తున్న మండల సభ్యులు

అధికారుల గైర్హాజరుపై సభ్యుల మండిపాటు
ప్రజాశక్తి -అనంతగిరి
: ప్రజాసమస్యలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇచ్చి, తగు పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అధికారులు గైర్హాజరైతే మండల సమావేశాలు నిర్వహించి ప్రయోజనమేమిటని జెడ్‌పిటిసి దీసరి గంగరాజుతోపాటు పలువురు సభ్యులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపికి శెట్టి నీలవేణి అధ్యక్షతన జరిగిన మండల సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. అధికారుల గైర్హాజరు అభివృద్ధికి ఆటంకం కాక మరేమిటని పలువురు ప్రశ్నించారు. అటవీశాఖ రేంజర్‌ కార్యాలయాన్నిమండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని, ప్రతి మండల సమావేశానికి ఫారెస్ట్‌ అధికారులు విధిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. విజయనగరం జిల్లా ఎస్‌కోటలో అటవీ రేంజర్‌ కార్యాలయం ఉంటే ఇక్కడి సమస్యలకు పరిష్కార చర్యల్లో జాప్యమౌతోందని ఆవేదన వెలిబుచ్చారు. అనంతగిరి పంచాయతీ రాజుపాక నుండి డెక్కపురం, హుకుంపేట మండలం పటకదౌవడ వరకు మంజూరైన రోడ్డు పనులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకుండా అభ్యంతరం పెట్టడం సరికాదని, దీనిపై డిఎఫ్‌ఒ స్పందించి తక్షణమే అనుమతులు జారీకి చర్యలు చేపట్టాలని కోరారు. రొంపల్లి పంచాయతీ కారకవలసలో విద్యుత్‌ లైన్‌ ఏర్పాటుకు, పెద్దబిడ్డ, చెరుకుమడ గ్రామం వద్ద కొండచరియల ముప్పు ఉందంటూ ఇళ్ల నిర్మాణాలకు అటవీఅధికారులు అడ్డుచెప్పడంపై ప్రశ్నించారు.దీనిపై అటవీశాఖ గార్డు దురుసుగా సమాధానమివ్వడంపై సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీశారు. అటవీశాఖ కిందిస్థాయి సిబ్బందిని సమావేశానికి పంపి చేతులు దులుపుకోవడమే కాకుండా, వచ్చిన వారి వద్ద కనీస సమాచారం లేకపోగా, సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, వెంటనే సంబంధిత గార్డును మండల సభను బయటకు పంపేయాలని, అటవీ రేంజర్‌ వచ్చి సమాధానం చెప్పేలా చర్యలు తీసుకోవాలని సభ్యులంతా కోరారు. గర్భిణులు, బాలింతల మరణాలపై మండల సభలో చర్చించారు. కార్యక్రమంలో ఎంపిటిసిలు, సర్పంచులు కె.మొస్య ఎస్‌.రూతు, కె.అప్పారావు ఎంపిడిఒ హర్షిత్‌, వైద్యాధికారి జ్ఞానేశ్వరి పాల్గొన్నారు